కోల్సిటీ, జూలై 17: అది 75ఏండ్ల నాటి భారీ చింత చెట్టు.. ఎన్నో పక్షులకు ఆవాసం.. కానీ, ఇప్పుడది నేలమట్టం కావడంతో వలస పక్షుల గూడు చెదిరింది. గోదావరిఖని అడ్డగుంటపల్లి ప్రాంతంలో ఉన్న త్రివేణి కాంప్లెక్స్ ఎదుట జరిగిన ఈ ఘటన పక్షి ప్రేమికులను కలిచివేసింది. రోడ్డు వెడల్పు పేరిట రామగుండం నగరపాలక సంస్థ అధికారులు బుధవారం రాత్రి ఆ చింత చెట్టును కూల్చివేడంతో వందలాది కొంగలు, ఇతర వలస పక్షుల ఆవాసం చెదిరింది. దీంతో పక్షులు రాత్రంతా నేలమట్టమైన చెట్టుపైనే బిక్కుబిక్కుమంటూ గడిపాయి.
చెట్టును కొట్టి వేస్తున్న క్రమంలో కొన్ని పక్షులు చనిపోయాయి. మరికొన్ని గాయపడ్డాయి. కొందరు వేటగాళ్లు అటుగా వచ్చి సుమారు 30 కొంగలను పట్టుకొని తీసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. మిగతా కొంగల కోసం స్థానికులు అర్ధరాత్రి వరకు కాపలాగా ఉన్నారు. కానీ, తెల్లవారుజామున చూసేసరికి చాలా కొంగలు చనిపోయి ఉన్నాయి. ఈ విషయం తెలియగానే పర్యావరణ ప్రేమికులు అక్కడకు చేరుకొని నగరపాలక అధికారుల చర్యలను వ్యతిరేకించారు.