Suspension | ధర్మపురి, ఆగస్టు 01 : డైలీ సానిటేషన్ రిపోర్ట్(డీఎస్ఆర్) యాప్లో తన లైవ్ ఫోటోను అప్లోడ్ చేసి హాజరు నమోదు చేయాల్సిన పంచాయితీ కార్యదర్శి డీఎస్ఆర్ యాప్లో తన ఫొటోకు బదులు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి క్యాప్చర్ ఫోటోను అప్లోడ్ చేసి దొరికిపోయాడు. ఇంతటి నిర్లక్ష్య ధోరణి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు పంచాయితీ కార్యదర్శి పై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సస్సెన్షన్ వేటు వేశారు. వివరాలిలా ఉన్నాయి.
పంచాయితీరాజ్ చట్టం నియమాల ప్రకారం.. ప్రతీ పంచాయితీ కార్యదర్శి ప్రతీ రోజూ గ్రామపంచాయితీల్లో పారిశుధ్య పనులు పర్యవేక్షించడానికి ఉదయం 7గంటల లోపు విధులకు హాజరై పంచాయితీలో పర్యటించాల్సి ఉంటుంది. అలాగే నూతనంగా ప్రవేశపెట్టిన డీఎస్ఆర్ యాప్లో పంచాయితీ కార్యదర్శులు వారి గ్రామపంచాయితీ భవన పరిసర ప్రాంతాల్లో రిజిస్ట్ అయినటువంటి జియో కో- ఆర్డినేట్స్ లొకేషన్లో ప్రతీరోజు డీఎస్ఆర్ యాప్ నందు తన లైవ్ ఫొటో అప్లోడ్ చేసి హాజరు నమోదు చేయవలసి ఉంటుంది.
అయితే జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందయ్యపల్లి గ్రామపంచాయితీ కార్యదర్శి టీ రాజన్న జూన్ మాసంలో డీఎస్ఆర్ యాప్లో తన లైవ్ ఫొటో అప్లోడ్ చేసి హాజరు నమోదు చేయాల్సిఉండగా… తన ఫొటోకు బదులు సీఎం రేవంత్రెడ్డి ఫోటోను క్యాప్చర్ చేసి అప్లోడ్ చేశాడు. అధికారులు ఏం పరిశీలిస్తారులే.. అనుకున్నాడో తెలీదుకానీ ఏకంగా సీఎం ఫొటోనే క్యాప్చర్ చేసి అప్లోడ్ చేశాడు. కానీ అధికారులు జూన్ మాసానికి సంబంధించిన డిఎస్ఆర్ యాప్ ను పరిశీలించగా ఈ దారుణం బయటపడింది. అయితే దీనిపై సదరు కార్యదర్శి వివరణ కోరుతూ’ గురువారం కలెక్టర్ సత్యప్రసాద్ జారీ చేసిన షోకాజ్ నోటీస్ కు సరైన సమాధానం సమర్పించకపోవడంతో శుక్రవారం కార్యదర్శి రాజన్నను విధుల నుండి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.