ACB Trap | ఎల్లారెడ్డిపేట, మే, 31: ల్యాండ్ సర్వే పంచానామా ధ్రువీకరణ పత్రానికి లంచం తీసుకుంటుండగా ఎల్లారెడ్డిపేట కు చెందిన సర్వేయర్ నాగరాజును ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి శనివారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డీస్పీ కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ గా విధులు నిర్వర్తిస్తున్న నాగరాజు వెంకటాపూర్ కు చెందిన జక్కాపురం మల్లేశం అనే రైతు వెంకటాపూర్ లో తన భూమి సర్వే నెంబర్ 476ఈ లోని 3 గుంటలు, 476జి లో 3 గుంటల భూమి కొలతల పంచనామా ధ్రువీకరణ పత్రం కోసం రూ.లక్ష డిమాండ్ చేశాడు.
ఇందుకోసం మల్లేశం ఇదివరకే రూ.22 వేలు సర్వేయర్ కు అందజేశాడు. మిగతా డబ్బుల కోసం ఇబ్బందులు పెడుతుండగా విసిగి పోయిన మల్లేశం ఏసీబీని ఆశ్రయించాడు. మరో రూ.15 వేలు కు ఇస్తానని నాగరాజు చెప్పి ఏసీబీ కి సమాచారం అందజేశాడు. దీంతో చంద్రంపేట రైతు వేదిక వద్ద మరో రూ.15 వేలు లంచం మల్లేశం నుంచి సర్వేయర్ కు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం నాగరాజును అధికారులు ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు.