Singareni profits | గోదావరిఖని : 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6394 కోట్ల భారీ లాభాలను అర్పించిన సింగరేణి సంస్థకు ఆర్జీ-1 డివిజన్లోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు-5 రూ.943.39 కోట్ల భారీ లాభాలను అర్జించి వెన్నుదన్నుగా నిలిచింది. గత సంవత్సరం సింగరేణి సంస్థ సాధించిన మొత్తం లాభాల్లో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు-5 14.75శాతం లాభాల వాటాగా నిలవడం విశేషం. గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఓసీపీ-5 భారీగా బొగ్గు ఉత్పత్తి పెంచుకుంటూ పోతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 39.93 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించిన ఈ ప్రాజెక్టు కేవలం టన్నుకు రూ.1900 వ్యయంతో బొగ్గు ఉత్పత్తి చేసింది.
బొగ్గు మార్కెట్లో టన్ను బొగ్గు అమ్మడం ద్వారా రూ.4262 అర్జించింది. దీంతో టన్నుకు రూ.2363 లాభం చేకూరడంతో ఈ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ భారీ లాభాలను ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన ఓసీపీ-5 ఆ సంవత్సరం 4.13 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తితో రూ.41.55 కోట్ల లాభాలను అర్జించింది. ఆ తర్వాత 2022-23లో 34.61 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తితో రూ.721.47 కోట్ల లాభాలను సాధించింది. 2023-24 లో 35.05 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తితో రూ.687.58 కోట్ల లాభాన్ని అర్జించింది.
వీటన్నిటిని మించి గత ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించడం విశేషం. భారీ లాభాల సాధనకు రామగుండం డివిజన్-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, ఓసీపీ-5 అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఎంతగానో కృషి చేశారు. భారీ లాభాలు అర్జించిన ఓసీపీ-5 కార్మికులకు ప్రత్యేక బహుమతులు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.