గంగాధర, జనవరి 9 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్‌కు రేవంత్ సర్కారు కుట్ర చేస్తున్నదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. తప్పుడు కేసులతో అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తే రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని హెచ్చరించారు. గంగాధర మండలం కురిక్యాలలోని శుభమస్తు ఫంక్షన్హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్ములా-ఈ రేసులో ఎలాంటి అవినీతికి తావులేకున్నా ప్రభుత్వం అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. కేవలం ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీలపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రశ్నిస్తున్నందున వారిపై అక్రమంగా కేసులు పెడుతోందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికే రోల్‌మోడల్‌గా నిలువగా, రేవంత్‌రెడ్డి పాలనలో అధోగతి పాలవుతున్నదన్నారు. చొప్పదండి నియోజకవర్గానికి వరప్రదాయినిగా ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్‌ను ఎల్లంపల్లి జలాలతో నింపి పంటలకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు.
నారాయణపూర్ రిజర్వాయర్ కింద నియోజకవర్గంలో దాదాపు 70ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. నాలుగు రోజుల్లో రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ గంగాధర సింగిల్‌విండో చైర్మన్ దూలం బాలగౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, మాజీ సర్పంచులు కంకణాల విజేందర్‌రెడ్డి, ఎండీ నజీర్, వేముల దామోదర్, ముక్కెర మల్లేశం, జోగు లక్ష్మీరాజం, రామిడి సురేందర్, వడ్లూరి ఆదిమల్లు, పొట్టల కనకయ్య, నాయకులు కర్ర శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పుల గంగాధర్, లింగాల దుర్గయ్య, నాగారపు సత్యనారాయణ, ద్యావ మధుసూదన్‌రెడ్డి, దోమకొండ మల్లయ్య, లింగాల లింగయ్య, అజ్జు, సముద్రాల అజయ్, మామిడిపెల్లి అఖిల్, హరీశ్, తదితరులు పాల్గొన్నారు.