ఇల్లంతకుంట రూరల్, మే 24: ‘పొద్దుతిరుగుడు రైతులు పంటను దళారులకు అమ్ముకోవద్దు. ప్రభుత్వమే నాలుగు రోజుల్లోగా కొనుగోలు చేస్తుంది’ అని ఇల్లంతకుంట ఏఎంసీ చైర్మన్ ఐరెడ్డి చైతన్య మహేందర్రెడ్డి ఆదివారం ప్రకటించారు. పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు వ్యవసాయశాఖ మంత్రి నాగేశ్వర్రావు అలాట్మెంట్ ఇస్తున్నారని వివరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూర్, బెజ్జంకి, కోహెడ మండలాల్లో వేలాది ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగు చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా మొత్తానికి ఒకే కొనుగోలు కేంద్రం ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అయితే ప్రభుత్వం అరకొరగా కొనుగోళ్లు చేసి చేతులెత్త్తేయడంతో గత పది రోజుల నుంచి ఇల్లంతకుంట మండలంలోని రైతులు ధర్నాలు, వంటావార్పు చేస్తున్న విషయం విదితమే. అలాగే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను కలిసేందుకు సిద్ధ్దమవుతున్న తరుణంలో రైతుల బాధలను వివరిస్తూ ‘కేసీఆర్ సార్ మీరే దిక్కు’, ‘పొద్దు తిరుగుడు కొనేదెప్పుడు?’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవల ప్రచురితమైన కథనాలు ప్రభుత్వాన్ని కదిలించినట్టు తెలిసింది. సర్కారుపై రైతుల తిరుగుబాటు తప్పదనే ఉద్దేశ్యంతో పొద్దుతిరుగుడు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఏఎంసీ చైర్మన్ ప్రకటన చేసినట్టు తెలుస్తున్నది.