2కే రన్ అదిరింది.. ఉదయం 6 గంటలకే వేలాదిగా తరలివచ్చిన యువతీ యువకులతో ఉత్సాహంగా సాగింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం పోలీసు, క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరుగు అట్టహాసంగా జరిగింది. నియోజకవర్గ కేంద్రాల్లో ప్రముఖులు హాజరై బెలూన్లు ఎగరేసి, జెండా ఊపి రన్‌ను ప్రారంభించగా, అన్ని చోట్లా విజయవంతమైంది. కరీంనగర్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మానకొండూర్, చొప్పదండిలో రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, హుజూరాబాద్‌లో మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొని యువతలో స్ఫూర్తి నింపారు. యువత శారీరక దృఢత్వం, మంచి ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామం చేయాలని, ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని అధిగమించవచ్చని సూచించారు.
– రాంనగర్/ చొప్పదండి/ మానకొండూర్/ హుజూరాబాద్, జూన్ 12
రాంనగర్/ చొప్పదండి/ మానకొండూర్/ హుజూరాబాద్, జూన్ 12 : దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం పోలీసు, క్రీడా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ విజయవంతమైంది. యువతీ యువకులు పెద్ద సంఖ్యలో తరలిరాగా, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని వారిలో ఉత్సాహం నింపారు. ప్రత్యేక టీ షర్టులు ధరించి రోడ్లపై పరు గులు పెట్టారు. కరీంనగర్లో జరిగిన 2కే రన్‌ను అంబేద్కర్ స్టేడియం వద్ద కలెక్టర్ కర్ణన్‌తో కలిసి సీపీ సుబ్బారాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి తిరుమలనగర్ చౌరస్తా, భగత్‌నగర్, కలెక్టరేట్, మల్టీప్లెక్స్ మీదుగా పరేడ్ గ్రౌండ్ వరకు పరుగు కొనసాగింది. రన్లో క్రీడా జ్యోతిని చేత పట్టుకుని అధికారులు, వివిధ విభాగాలకు చెందిన ప్రతిని ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు వెయ్యి మంది తరలిరాగా, ఇక్కడ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాం ప్రసాద్‌లాల్ హాజ రయ్యారు.
మానకొండూర్‌లో నిర్వహించిన ర్యాలీని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభించారు. స్థానిక పల్లెమీద చౌరస్తా వద్ద ప్రారంభమైన రన్ చెరువుకట్ట వరకు సాగింది. ఇక్కడ బీఅర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు. చొప్పదండి పట్టణంలో జరిగిన రన్‌ను ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ రూరల్ ఏసీపీ కరుణాకర్రావుతో కలిసి ప్రాంభించారు. స్థానిక అంబేదర్ విగ్రహం నుంచి వివేకానంద విగ్రహం వరకు రన్ కొనసాగింది. హుజూరాబాద్ పట్టణంలో జరిగిన 2కే రన్‌ను మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి ప్రారంభించారు. స్థానిక అంబేదర్ చౌరస్తా నుంచి సిర్సపల్లి క్రాస్ దాకా రన్ కొనసాగగా, మండలి విప్ పరుగులో ఉత్సాహంగా పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచారు. అనంతరం మిగతా స్థానాల్లో నిలిచిన వారికి విప్ కౌశిక్‌రెడ్డి బహుమతులు, రన్లో పాల్గొన్న వారందరికీ పండ్లు అందజేశారు. స్వతహాగా తాను క్రికెటర్ కాబట్టి రన్నింగ్ చేసి ముందంజలో నిలిచినట్లు మండలి విప్ కౌశిక్‌రెడ్డి తెలిపారు.