Best results | కమాన్ చౌరస్తా, జూలై 24 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కావాల్సిన వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నామని, జిల్లా యంత్రాంగం తరఫున ఎలాంటి సహకారమైనా అందిస్తామని, ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాల సాధించేలా కృషి చేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం విద్యాశాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు వయసుకు మించిన బ్యాగుల భారం మోస్తున్నారని, గంగాధర మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న విధానం ద్వారా బ్యాగుల బరువు తగ్గించాలని సూచించారు.
పాఠశాలలో ఖాళీగా ఉన్న అన్ని గదులను ఉపయోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న గదుల్లో డైనింగ్ హాల్, గ్రంథాలయం, కంప్యూటర్ గది, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గది, సైన్స్ ప్రయోగశాల వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక అంగన్వాడీ కేంద్రాలు, భవిత కేంద్రాలకు అదనంగా ఉన్న తరగతి గదులు కేటాయించాలని సూచించారు. జిల్లాలో విద్యా శాఖలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల ద్వారా ప్రతీ విద్యార్థి విభిన్న రంగాల్లో రాణించేలా చూడాలని తెలిపారు. స్నేహిత, మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను నియమించాలని, ఇంగ్లీష్ క్లబ్ ప్రతీ స్కూల్లోనూ అమలు చేయాలని అన్నారు.
ప్రతీ పాఠశాలను సందర్శించి ల్యాబ్ తీరు పరిశీలించాలని జిల్లా సైన్స్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలో విటమిన్ గార్డెన్ లపై దృష్టి పెట్టాలని అన్నారు. తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేస్తూ పిల్లల ప్రగతిని వారికి తెలియజేయాలని, బుధవారం బోధన కార్యక్రమం ద్వారా విద్యార్థులను చదివించాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ఓపెన్ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచాలని సూచించారు. ముఖ గుర్తింపు హాజరు శాతం పెంచాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ, కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, మిల్కురి శ్రీనివాస్, ఆంజనేయులు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.