కమాన్‌చౌరస్తా, జనవరి 3: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని మేయర్ యాదగిరి సునీల్ రావు పిలుపునిచ్చారు. నగరంలోని మంకమ్మతోటలో ఉన్న ధన్గర్‌వాడీ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన టీఎల్ఎం మేళాను ఆయన కార్పొరేటర్ జితేందర్‌తో కలిసి ప్రారంభించారు. ఉపాధ్యాయులు తయారు చేసిన ప్రదర్శించిన ప్రాజెక్ట్‌లను పరిశీలించారు.
ఉపాధ్యాయులు అవలంబిస్తున్న బోధన పద్ధతుల గురించి తెలుసుకొని అభినందించారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ-క్లాస్ రూం సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ప్రైవేట్‌కు దీటుగా చదువుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, ఉపాధ్యాయుల విద్యాబోధన కారణమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులపై ఉన్న నమ్మకంతోనే తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎంఈవో మధుసూదనా చారి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, జనవరి 3: కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని దుర్శేడ్ జడ్పీ ఉన్నత పాఠశాలలో టీఎల్ఎం మేళాను ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీ పురుమల్ల లలిత-శ్రీనివాస్, ఎంపీటీసీ రాజ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, బోధన అభ్యాసన సామగ్రి ఉపయోగించడం ద్వారా విద్యార్థులకు మరింత సులభతరంగా అర్థమయ్యేలా బోధించవచ్చని తెలిపారు. మండలంలోని ఆయా పాఠశాలలకు చెందిన 30 మంది ఉపాధ్యాయులు వివిధ ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించారు.
అంతకుముందు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ వెంకటపద్మాదేవి, దుర్మేడ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు రాజమౌళి, నగునూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చొప్పదండి, జనవరి 3: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో టీఎల్ఎం మేళా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈవో వేణుకుమార్, ప్రధానోపాధ్యాయురాలు కరుణ, సావిత్రి, ఆర్పీలు అనిల్‌కుమార్, సుజాత, శాంతికిరణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, జనవరి 3: మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం బోధనోపకరణాల మేళాను అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ మేళాలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సైన్స్, గణితం, ఇంగ్లిష్, తెలుగు అంశాల్లో రూపొందించిన ప్రయోగాలను, పాఠ్యాంశాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రామడుగు, జనవరి 3: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టీఎల్ఎం మేళాలో మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తీసుకువచ్చిన బోధనోపకరణాలను ప్రదర్శించారు. గణితం, ఇంగ్లిష్, సైన్స్, తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలను విద్యార్థులకు బోధించే తీరును వివరించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.