Awareness | జగిత్యాల క్రైం : సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ట్రాఫిక్ ఎస్సై గౌతమ్ సూచించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆలోచన మేరకు ఆయన మోడల్ స్కూల్లో శనివారం పోలీస్ పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చట్టాలు, సైబర్ నేరాలు, వ్యసనాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాల నివారణ, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థుల్లో చిన్నప్పటి నుండే అవగాహన పెంపొందిస్తే, రాబోయే రోజుల్లో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.
పిల్లలకు సమాజం లో జరిగే సామాజిక అంశాలపై సరైన అవగాహన కల్పిస్తే, రేపటి సమాజం మరింత భద్రమవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు సురక్షిత ప్రయాణ పద్ధతులు, రోడ్డు పై ఎలా సురక్షితంగా నడవాలి, రోడ్డు దాటేటపుడు పాటించాల్సిన నియమాలు, సైకిల్ నడిపేటప్పుడు, కుటుంబ సభ్యులతో కార్, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెల్మెట్, సీటుబెల్ట్ వాడక ప్రాముఖ్యత, రోడ్ల పై మొబైల్ వాడకం వల్ల జరిగే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు అవగాహన కల్పించినట్లు చెప్పారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ సైబర్ నేరానికి గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి సమాచారమివ్వాలని అవగాహన కల్పించారు. ప్రస్తుతo Digital arrest , Job Fraud , Cyber slavery, Cyber stalking, APK ఫైల్స్ ఓపెన్ చేయొద్దని, వాటివల్ల జరిగే మోసాలు ఎక్కువగా ఉన్నాయని, వీటి పైన జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్‌మీడియాపై జాగ్రత్తగా ఉంటూ కెరీర్‌పై దృష్టిపెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న విషయాలను తమ తల్లిదండ్రులకు ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల వారికి వివరించి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి వారియర్స్ గా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అరుంధతి, ట్రాఫిక్ సిబ్బంది సంతోష్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.