కొత్తపల్లి, నవంబర్ 30 : విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కొత్తపల్లి(హవేలీ)లోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 52వ బాలల జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రశ్నించడం అనేది విద్యార్థి దశలోనే అలవర్చుకున్నట్లయితే ఎన్నో శాస్త్రీయ ఆలోచనలు, నూతన ఆవిషరణలు, అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
అనంతరం శాసనమండలి సభ్యుడు కూర రఘోత్తమరెడ్డి మాట్లాడుతూ, వేల సంవత్సరాల క్రితమే భారతదేశం శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని ముందుకెళ్తున్నదన్నారు. కొత్త కొత్త ఆవిషరణలన్నింటికీ మూలం భారతదేశమేనని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో సి.హెచ్.వి.ఎస్.జనార్దన్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, సెయింట్ జార్జ్ పాఠశాల చైర్మన్ డా. ఫాతిమారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి చాడ జయపాల్ రెడ్డి, డి.సి.ఇ.బి సెక్రటరీ మారం స్వదేశీ కుమార్, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ కల్వకుంట్ల రామకృష్ణ, కౌన్సిలర్ వేణుగోపాల్, మహ్మద్ అజీం, భగవంతయ్య, ఏనుగు ప్రభాకర్ రావు, కర్ర అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాలల జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనకు స్పందన
సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సూల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లాలోని పాఠశాలల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇందులో 624 ప్రదర్శనలు, ఇన్స్పైర్ అవార్డ్స్ మనక్ 2023-24 కోసం 147 ప్రదర్శనలు వచ్చాయి.