కార్పొరేషన్/కొత్తపల్లి, డిసెంబర్ 14: జాతీయ స్థాయి సీబీఎస్ఈ సైన్స్ ఎగ్జిబిషన్‌కు కొత్తపల్లి మండలంలోని పారమిత హెరిటేజ్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని ఎస్ శుభశ్రీ ఎంపికైంది. శుభశ్రీ గైడ్ టీచర్ లలిత్ మోహన్ సాహు ఆధ్వర్యంలో మల్టీఫంక్షనల్ ఎకో ఫ్రెండ్లీ ఆగ్రో మిషన్ తయారు చేయగా, జనవరిలో న్యూఢిల్లీలో జరిగే నేషనల్ సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తుందని పాఠశాల ప్రిన్సిపాల్ సంజయ్ భట్టాచార్జీ తెలిపారు.
ఈ నెల 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ సూల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సీబీఎస్ఈ రీజినల్ సైన్స్ ఎగ్జిబిషన్లో ఈ ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. పర్యావరణ విభాగంలో మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపారు.
శుభశ్రీ రూపొందించిన ఈ యంత్రం రైతుల జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ మిషన్ ధాన్యం నూర్పిడి, ధాన్యాన్ని వేరు చేయడం, పశువులకు మేతగా ఉపయోగించే గడ్డిని కత్తిరించడం, దంచిన బియ్యం నుంచి ఊకను వేరు చేయడం, బ్యాగ్ కుట్టడం వంటి నాలుగు వేర్వేరు కార్యకలాపాలతో సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. ఈ నమూనాను రైతుల అవసరాలకు అనుగుణంగా సౌరశక్తితో కాని, విద్యుత్ సరఫరాతో కూడా ఆపరేట్ చేయవచ్చన్నారు.
ప్రస్తుతం ఉన్న యంత్రాల కంటే ఈ మోడల్ అనేక ప్రయోజనాలను కలిగి ఉందని, ఈ యంత్రాన్ని బహుళ పంటలకు ఉపయోగించవచ్చని తెలిపారు. శుభశ్రీని బుధవారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ సీఈవో ప్రియాంక, పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రష్మిత, రాకేశ్, అనుకర్‌రావు, ప్రసాద్, వినోద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డా. బీ సంజయ్, ప్రోగ్రాం హెడ్ గోపీకృష్ణ, సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.