విద్యానగర్, జూన్ 1: మనం పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు, ఉద్యోగుల సమ్మేళనాలు, కులబాంధవుల ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకోవడం చూస్తుంటాం! ఎప్పుడో 45 ఏళ్ల క్రితం లోయర్ మానేర్ డ్యాంలో ముంపునకు గురైన యాస్వాడ గ్రామస్తులందరూ ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. కుల, మత, ప్రాంతీయ వర్గ భేదం లేకుండా అందరూ కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ప్రత్యేకతను చాటుకున్నది. 1980 ఆగస్టులో నిర్మాణమైన లోయర్ మానేర్ డ్యాంతో ఎన్నో గ్రామాలు చెల్లా చెదురయ్యాయి.
వందల సంఖ్యలో కుటుంబాలు తలోదిక్కున పోయాయి. ఇలానే యాస్వాడ గ్రామస్తులు ఇతర గ్రామాలకు వెళ్లి నివాసాలు ఏర్పరచుకున్నారు. కానీ, తమతో కలిసి ఉన్న అప్పటి వాళ్లందరిని కలువాలని యాస్వాడ గ్రామస్తులు మధుసూదన్ రెడ్డి తపించారు. అనుకున్నదే తడవుగా అందరినీ కలిసి ఒకే వేదికపైకి తెచ్చారు. ఆదివారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని కొత్త యాస్వాడలోని సప్తగిరి ఫంక్షన్లో 300 మంది కలిశారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
తన అనుభవాలను ఇప్పటి తరానికి వివరించారు. నాటి గ్రామంలో ఉన్న పురాతన శివలయాన్ని పునర్ నిర్మించాలని అందరు కలిసి తీర్మానించారు. ఈ కార్యక్రమంలో బొమ్మ ఈశ్వర్ గౌడ్, అబ్బిడి భాస్కర్‌రెడ్డి, అట్టేపల్లి నర్సయ్య, ర్యాకం సుధాకర్, సంజీవ్‌కుమార్, బొద్దుల సత్తయ్య, అట్టేపల్లి శ్రీధర్, పోలాడి మాధవరావు, రమణారావు, కామ శ్రీనివాస్, పంజాల భాస్కర్, దయాసాగర్ రావు, గణపతి, శ్రీరామ్ రెడ్డి, కమిటీ రాములు, కటకం శ్రీనివాస్, భాసర్ రెడ్డి, కుల్ల జయేందర్, పోచయ్య, ఎల్లయ్య, తీగల మునిందర్, వజ్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.