సబ్సిడీ సిలిండర్ స్కీం అటకెక్కిందా..? ‘మహాలక్ష్మి’ కింద రూ.500కే అందిస్తామన్న కాంగ్రెస్ హామీ మూన్నాళ్ల ముచ్చటే అయ్యిందా..? కేవలం ఏడాది పాటు అమలు చేసి, పేద మహిళలను మురిపించి చేతులెత్తేసిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. గతేడాది ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చిన పథకం ఈ ఏడాది మార్చిలో నిలిచిపోయింది. ఎనిమిది నెలలుగా రాయితీకి బ్రేక్ పడగా, పేదలపై పూర్తి భారం పడుతున్నది. ప్రభుత్వం స్పందించి డబ్బులు జమ చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
పెద్దపల్లి, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): సబ్సిడీ గ్యాస్ సిలిండర్ స్కీంకు కాంగ్రెస్ మంగళం పాడినట్లు తెలుస్తున్నది. మహాలక్ష్మి పథకంలో రూ.500 కే అందిస్తామని ఎన్నికలకు ముందు బీరాలు పలికి లబ్ధిపొందింది. 2023 డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించినా, తీవ్ర జాప్యం చేసింది. 2024 ఫిబ్రవరి 27న అమలు చేయడం మొదలు పెట్టింది. కచ్చితంగా ఒక్కటంటే ఒక్క ఏడాది మాత్రమే కొనసాగిన పథకం, తర్వాత మూన్నాళ్ల ముచ్చటే అయింది.
2025 మార్చి నుంచి వినియోగదారుల ఖాతాల్లో రాయితీ సొమ్ము జమ కాకపోవడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగిలాయి. రాయితీ సొమ్ముపై వినియోగదారుల మొబైల్‌కు మెస్సేజ్ వస్తుందని అధికారులు చెబుతున్నప్పటికీ దీనిపై స్పష్టత లేదు. స్కీం తిరిగి అమలవుతుందా..? లేక నీళ్లు వదిలినట్లేనా..? అనే అనుమానాలు వస్తున్నాయి.
పెద్దపల్లి జిల్లాలో ఇండియన్, హెచ్‌పీ, భారత్‌లకు చెందిన 2,50,117 కనెక్షన్లు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం కింద 1,15,781 కుటుంబాలను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. సాధారణంగా ప్రతి కుటుంబం రెండు నెలలకొకటి చొప్పున ఏడాదికి ఆరు సిలిండర్లు వినియోగిస్తుంటారు. అయితే, ఎనిమిది నెలలుగా రాయితీ సొమ్ము ఆగిపోయిన క్రమంలో ఒక్కో వినియోగదారుడికి రూ.3 వేల నుంచి రూ.4 వేల పైనే రావాల్సి ఉంది. లబ్ధిదారులు ఎవరిని సంప్రదించాలో తెలియక అయోమయంలో పడిపోతున్నారు. అధికారులను వెళ్లి అడిగితే ఖాతాల్లో జమవుతున్నాయని సమాధానం ఇచ్చి దాటేస్తున్నారు.
గ్యాస్ డబ్బులు పడుతలేవు..
సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రూ.500కే ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్పింది. కొద్దిరోజుల పాటు అమలు చేసి, చేతులెత్తేసింది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.925 కాగా, రూ.500 పోను మిగిలిన డబ్బులు ఐదారు నెలల నుంచి ఖాతాలో పడుతలేవు. పథకం మూన్నాళ్ల ముచ్చటే అయింది. పూర్తి భారం మాపైనే పడుతున్నది. కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఏడు నెలల రాయితీ డబ్బులు ఖాతాలో జమ చేయాలి.
– నాంసాని రాధ, గృహిణి, పెద్దపల్లి