Solar power plant | పెద్దపల్లి, జూలై7: జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పీఎం కుసుమ్ పథకం అమలుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ పీఎం కుసుమ్ పథకం కింద రైతులు లేదా రైతు సహకార సంఘాలు వారి భూమిలో 500 కిలో వాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ఉత్పత్తి చేసిన విద్యుత్తును విక్రయించటం ద్వారా నెల నెలా ఆదాయం పొందవచ్చనన్నారు.
జిల్లాలో 4 రైతు సహకార సంఘాల ద్వారా పీఏం కుసుమ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ఒప్పందం అయినట్లు వెల్లడించారు. 9 నెలల కాలంలో 4 చోట్ల 1 మెగా వాట్ చొప్పున సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. టీజీ రెడ్కో నోడల్ ఏజెన్సీ సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం కింద ఇంటిపై సోలార్ విద్యుత్ ప్యానల్ ఏర్పాటు చర్యలు తీసుకోవాలన్నారు.
ఒకే కాలనీలో వందల మంది లబ్ధిదారులు ఇంటిపై ప్యానెల్స్ ఏర్పాటుకు ముందు వస్తే కలెక్టరేట్ నుంచి అదనంగా రూ.10 వేల సబ్సిడీ అందిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఆర్డీవో బీ గంగయ్య, జిల్లా సహకార అధికారి శ్రీమాల, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.