Peddapally | పెద్దపల్లి, ఏప్రిల్ 11 : డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఈగల్ టీం ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణపై జిల్లా కేంద్రంలో శనివారం అవగాహన ర్యాలీ తీశారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం ఔషధాల దుర్వినియోగం, హెచ్/హెచ్1 ఔషధాల నియంత్రణ, క్యూ ఆర్ కోడ్ వెరిఫికేషన్, లైసెన్స్ వెరిఫికేషన్, నిషేధిత మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ కే ప్రమోద్ కుమార్, ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రభాకర్, పెద్దపల్లి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మాడురీ వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి కజంపురం రాజేందర్, కోశాధికారి పోలు సతీష్, ఫార్మాసిస్టులు తదితరులు పాల్గొన్నారు.