Strict action | వీణవంక, సెప్టెంబర్ 19 : నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హుజురాబాద్ ఏసీపీ మాధవి లత హెచ్చరించారు. వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో సీపీ గౌస్ ఆలం అదేశాల మేరకు హుజురాబాద్ ఏసీపీ మాధవి లత ఆధ్వర్యంలో పోలీసులు శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది పోలీసులు ప్రతీ ఇంటికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. పాత నేరస్థులు అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తున్నారా అని.. ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. వీటిలో 18 బైకులు, 22 ట్రాక్టర్ లు 3 ఇసుక ట్రాక్టర్ లను సీజ్ చేసినట్లు ఏసీపీ మాధవి తెలిపారు.
సైబర్ నేరాలు జరుగుతున్న తీరును వివరించి , సైబర్ నేరానికి గురైనట్లయితే వెంటనే స్పందించి, నేరం జరిగిన గంట లోపల 1930 నంబర్ కు ఫోన్ చేయడం ద్వారా తస్కరించబడిన సొమ్మును ఫ్రీజ్ చేసి తిరిగి పొందవచ్చని తెలిపారు. మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేయడం, అమ్మకం, వినియోగించడం చట్ట ప్రకారం నేరమని స్పష్టం చేశారు. వాటి వలన కలిగే దుష్పరిణామాలపై స్థానికులకు అవగాహన కల్పించా రు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాల గురించి యువతకు వివరించారు. చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు .
చట్ట వ్యతిరేక కార్యకలాపాల పై ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 ద్వారా లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. డ్రగ్ రహిత సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని సూచించా రు .ఈ కార్యక్రమంలో జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీ నారాయణ, వీణవంక, ఇల్లంతకుంట, సైదాపూర్, జమ్మికుంట, హుజురాబాద్ ఎస్సైలు ఆవుల తిరుపతి, క్రాంతి కుమార్, తిరుపతి, సతీష్, రాధాకృష్ణ, స్థానిక పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.