సారంగాపూర్, ఆగస్టు 19: సీఎం కేసీఆర్ ముందు చూపుతో వ్యవసాయ రంగం బలోపేతం అయిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నదని కొనియాడారు. శనివారం ఆయన జగిత్యాల నియోజకవర్గంలో పర్యటించారు. బీర్పూర్ మండలం తుంగూర్‌లో కేడీసీసీ బ్యాంక్ బ్రాంచ్‌ను, బీర్పూర్ సహకార సంఘంలో ఏర్పాటు చేసిన సీఎస్సీ సెంటర్‌ను, రేచపల్లి, నాగునూర్‌లో మూడు వందల టన్నుల కెపాసిటీ ఉన్న రెండు సహకార సంఘ గోదాంలు, జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడలో నాబర్డ్ మరియు ప్యాక్స్ నిధులతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్, రెండు గోదాంలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ సాగునీటి ఇబ్బందులు లేకుండా ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా కాళేశ్వరం జలాలను శ్రీరాంసాగర్‌కు మళ్లించారని చెప్పారు. కోటి ఎకరాల మాగాణి కల నిజం చేశారన్నారు. బీర్పూర్ మండలంలో 136 కోట్లతో రోళ్లవాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. ప్రాజెక్ట్ పూర్తయితే బీర్పూర్, ధర్మపురి మండలాలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. రైతులకు లక్ష రుణమాఫీ చేయడం అభినందనీయమన్నారు. ఉమ్మడి జిల్లాలో 127 పీఏసీఎస్ కేంద్రాలు అభివృద్ధి వైపు నడిపించడంలో నాఫ్స్కాబ్ చైర్మన్ పాత్ర కీలకమని ప్రశంసించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ, మన రాష్ట్రం ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసేలా ఎదిగిందన్నారు.
జగిత్యాల నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ సహకార సంఘం బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామాల్లోని రైతులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా గోదాముల నిర్మాణాలు నిర్మిస్తున్నారన్నారు. ఇంకా 24గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, ఎరువులు, విత్తనాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారని కొనియాడారు. నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 కోట్లతో సహకార గోదాములు నిర్మిస్తున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 50 కోట్లతో గోదాముల నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. ప్రజలు మీ-సేవకు వెళ్లకుండా సంఘంలోనే దాదాపు 26 సేవలను అందిస్తుందన్నారు. రైతులందరూ సంఘం బలోపేతం కోసం తమవంతు కృషి చేయాలన్నారు. కేరళలో సంఘంలో ఉన్న సభ్యుల్లో ఎవరైనా చనిపోతే సంఘం తరఫున దహన సంస్కారాలు చేస్తారని తెలిపారు.
సంఘ సభ్యులందరికీ పుట్టినప్పటి నుంచి చివరి వరకు సంఘం సేవలందించేలా ఏర్పాట్లు జరుగుతాయన్నారు. రాబోయే రోజుల్లో సంఘ సభ్యులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైతులకు రుణమాఫీ చేసినందుకు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో డీసీఎమ్మెఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీ మసర్తి రమేశ్, జడ్పీటీసీలు మేడిపెల్లి మనోహర్‌రెడ్డి, పాత పద్మ-రమేశ్, డీసీవో రామానుజచార్యులు, జిల్లా డీసీసీబీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్‌రావు, విండో చైర్మన్ ఏలేటి నర్సింహరెడ్డి, ఉపాధ్యక్షుడు బాపిరాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల రాజేందర్‌రెడ్డి, నారపాక రమేశ్, ప్రధాన కార్యదర్శి శీలం రమేశ్, ప్రజాప్రతినిధులు గర్షకుర్తి శిల్ప, గుడిసే శ్రీమతి, మల్లీశ్వరి, ఎడమల జయ-లక్ష్మారెడ్డి, భూక్య లావణ్య రాథోడ్, జోగినిపల్లి సుధాకర్‌రావు, అజ్మిర శ్రీలత, రమణారావు, దమ్మ గంగు పాల్గొన్నారు.