Alaya Foundation | కోల్ సిటీ, ఏప్రిల్ 26 : తల్లిదండ్రులు లేని ఓ అనాథ యువతి పెళ్లికి ఆలయ ఫౌండేషన్ సభ్యులు అన్నీ తామై అండగా నడిచారు. పెళ్లి ఖర్చులకు రూ.30వేల నగదు, విందు భోజనాలకు 25 కిలోల బియ్యం అందజేసి ఆసరాగా నిలిచారు. తల్లిదండ్రులు లేని లోటు తీర్చడంలో సాయపడ్డారు. గోదావరిఖని వినోభా నగర్ కు చెందిన సాహితీ అనే యువతికి తల్లిదండ్రులు లేరు. ఒంటరిగానే జీవితం సాగించిన సాహితీకి పెళ్లి నిశ్ఛయమైంది. కానీ పెళ్లి ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి.
ఈ విషయం తెలిసి ఆలయ ఫౌండేషన్ సభ్యులు ఐత శివకుమార్ స్పందించారు. ఐఏఎస్ అధికారి నరహరి స్ఫూర్తితో సభ్యులంతా చేయి చేయి కలిపి రూ.30వేల నగదు పోగు చేశారు. ఈమేరకు ఆదివారం సాహితీ ఇంటికి వెళ్లి పెళ్లి కూతురుగా అలంకరించి ప్రభుత్వ దవాఖాన స్టాఫ్ నర్సు గుడిసెల పుష్ప చేతుల మీదుగా రూ.30వేల నగదుతోపాటు 25 కిలోల బియ్యం అందించారు. భవిష్యత్ లో సాహితీకి ఎలాంటి కష్టమొచ్చినా ఆలయ ఫౌండేషన్ ఆదుకుంటుందని భరోసా కల్పించారు. అనాథ యువతీ పెళ్లికి పెద్దలుగా వచ్చిన ఆలయ ఫౌండేషన్ సభ్యులను స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు లంక సురేష్, పల్లె ప్రశాంత్, ఐత దేవ, మణిదీప్, బేద శంకర్, రేవెల్లి సుజిత్, కుమార్, వికాస్, చరణ్, నవీన్, తిరుపతి, సతీశ్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.