Adluri Laxman Kumar | ధర్మారం, అక్టోబర్ 6 : మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి యువత ఉజ్వల భవిష్యత్‌ను నిర్మించుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కావొద్దని, మాదకద్రవ్యాల నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. బొమ్మారెడ్డిపల్లి గ్రామంలోని మహేశ్వర ఫంక్షన్ హాల్లో మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిషన్ పరివర్తన’ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రాంరెడ్డి తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీస్ శాఖ చేపట్టిన ‘మిషన్ పరివర్తన’ కార్యక్రమం ఎంతో మంచి కార్యక్రమమని అభినందించారు. యువత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై నిరంతరం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యంగా ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల విద్యార్థుల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై మరింత అవగాహన కల్పించేలా ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకర్షితులు కావొద్దని సూచించారు. తల్లిదండ్రులు సైతం వారి పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండి మత్తు పదార్థాలకు దూరంగా ఉండే విధంగా చూడాలని ఆయన సూచించారు. ఎవరైనా డ్రగ్స్ లేదా గంజాయి ప్రభావానికి గురైనట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని మంత్రి తెలిపారు. సమాచారం అందిన వెంటనే వారికి అవసరమైన డీ-అడిక్షన్ చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డ్రగ్స్ వినియోగం వైపు వెళ్లకుండా యువతను కాపాడటం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.

మాదకద్రవ్యాల నిర్మూలనకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలి : కలెక్టర్ కోయ శ్రీహర్ష
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సదస్సులో మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించడానికి ‘మిషన్ పరివర్తన’ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లోనూ మరింత విస్తృతంగా నిర్వహించి యువతలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను ప్రతి ఒక్కరికీ వివరించి, వాటి నిర్మూలనకు అవసరమైన చర్యలను సమన్వయంతో చేపట్టాలని సూచించారు.
డ్రగ్స్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు : పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి నాయక్
పెద్దపల్లి డీసీపీ భూక్య రాంరెడ్డి నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల విక్రయాలు, గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. యువత తమ విలువైన సమయాన్ని, భవిష్యత్‌ను డ్రగ్స్ కారణంగా నాశనం చేసుకోవద్దని సూచించారు. యువత తమ లక్ష్యాలపై దృష్టి సారించి మంచి భవిష్యత్‌ను నిర్మించుకోవాలని సూచించారు. ప్రస్తుతం మాదకద్రవ్యాల నిర్మూలన కోసం వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు చైతన్య సందేశాన్ని అందిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో యువత, ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఇతరులను కూడా వాటికి దూరంగా ఉండేలా చైతన్యపరుస్తామని ప్రతిజ్ఞలో పేర్కొన్నారు. మాదకద్రవ్యాల అక్రమ వినియోగం, విక్రయాలు, రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేస్తామని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి శాఖ అదనపు అధికారి రవీందర్, ఏసీపీ జీ కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్ ధర్మారం ఎస్సై ఎంబడి శ్రీకాంత్, వివిధ గ్రామాల సర్పంచులు, యువత, మహిళా సంఘాల సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.