Sunitha Laxma reddy | కలెక్టరేట్, మే 10 : ఆడ పిల్లలను పుట్టనిద్దామని, స్వేచ్ఛగా ఎదగనిద్దామని, చదువునిద్దామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఆడపిల్లలపై వివక్ష చూపకుండా మగ పిల్లలతో సమానంగా చూద్దామని, అప్పుడే మహిళల్లో స్వావలంబన సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో సుపరిపాలన కొనసాగుతున్నదని, మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో మహిళల్లో సాధికారత, ఆర్థిక స్వావలంబన పెరిగిందన్నారు. కరీంనగర్‌లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో స్త్రీశిశు సంక్షేమ శాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం మహిళా సాధికారత, గృహ హింస, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలపై మహిళా సంఘాల ప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బం ది, ఆశాకార్యకర్తలు, ఏఎన్ఎంలకు అవగాహన శిబిరం నిర్వహించారు. దీనికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.
మహిళల రక్షణ కోసం స్వరాష్ట్రంలో అనేక చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. ఆరోగ్య మహిళ, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ ఆరోగ్య కిట్, కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్, కల్యాణలక్ష్మి లాంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని, షీ టీంలు, భరో సా, సఖీ కేంద్రాలతో భరోసా కల్పిస్తున్నదని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా రుణాలిస్తూ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నదని చెప్పారు. అయినా సమాజంలో ఎక్కడో ఓచోట మహిళలపై అనుచిత ఘటనలు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. వీటిని సమూలంగా నిర్మూలించేందుకు అవసరమైన మార్పు ఇంటి నుంచే ప్రారం భం కావాలని సూచించారు.
పురుషాధిక్య పరిస్థితులు రూపుమాపేందుకు తమ కుటుంబాల్లోని ఆడ, మగ పిల్లలకు సమాన అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. నేటి పోటీ సమాజంలో మహిళలు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నా, గ్రామీణ ప్రాంతాల్లో ‘వంటింటికే పరిమితం’ అనే జాఢ్యం పూర్తిగా తొలగలేదన్నారు. దీనిని సమూలంగా నిర్మూలించేందుకు మహిళల కోసం తెచ్చిన చట్టాలు, మహిళల సంరక్షణ, తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పురుషులకు కూడా అవగాహన కల్పించాలని సూచించా రు. అపుడే నేర నిష్పత్తి తగ్గే అవకాశాలుంటాయన్నారు. నేటి పరిస్థితుల్లో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారని, ముఖ్యంగా విద్యారంగంలో బాలికలు పైచేయి సాధిస్తున్నారన్నారు. ఇందుకు నిదర్శనమే ఏటా టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఆపై పరీక్షల్లో బాలికలకు వస్తున్న ర్యాంకులేనని స్పష్టం చేశారు. మారుతున్న సమాజంలో సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉంద ని, ఇది పురుషులతో పాటు బాలబాలికలు, మహిళలపై కూడా పడుతున్నదన్నారు. దీని బారినుంచి తమ పిల్లలను రక్షించుకున్నపుడే వారి భవిష్యత్తు ఉన్నతంగా మారుతుందన్నారు. స్త్రీలు ఎదుర్కొంటున్న ఎలాంటి సమస్యలనైనా ట్విట్టర్, వాట్సాప్, ఎస్ఎంఎస్, పోస్ట్‌కార్డు ద్వారా మహిళా కమిషన్ దృష్టికి తెస్తే, యుద్ధ ప్రాతిపదికన విచారణ చేపట్టి, చర్యలు తీసకుంటామని స్పష్టం చేశారు.
అనంతరం జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. అందులో భాగంగానే రాజకీయాల్లో 50శాతం రిజర్వేషన్లు అమలు చేసి, పదవులు కట్టబెడుతున్నారని చెప్పారు. నగర మేయర్ సునీల్‌రావు మాట్లాడుతూ, బల్దియాలో సగానికిపైగా మహిళలే కార్పొరేటర్లు ఉన్నారని, తమ తమ డివిజన్లలోని ప్రజలకు నిర్విరామ సేవలందిస్తున్నారని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మహిళలకు భద్రత పెరిగిందని, వారి సమస్యలు పరిష్కరించేందుకు మహిళా కమిషన్ విశేష కృషి చేస్తున్నదన్నా రు. సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు పోలీసు శాఖ సంసిద్ధంగా ఉందన్నారు.
తమ శాఖ ఆధ్వర్యంలో మహిళా రక్షణ విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం మహి ళా కమిషన్ చైర్పర్సన్, సభ్యులకు స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారుల ఆధ్వర్యంలో జ్ఞాపికలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. అంతకుముందు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కరీంనగర్ జిల్లా జైలులోని 27మంది మహిళా ఖైదీలను కలిసి, వారి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంత రం నగరంలోని సఖీ కేంద్రాన్ని సందర్శించి, రికార్డులు తనిఖీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపహరిశంకర్, మహిళా కమిషన్ సభ్యులు కుమ్ర ఈశ్వరీ బాయి, కొమ్ము ఉమాదేవి, షాహీన్ అప్రోజ్, గద్దల పద్మ, శుద్ధం లక్ష్మి, కటారి రేవతిరావు, మహిళా కమిషన్ కార్యదర్శి కృష్ణకుమారి, డైరెక్టర్ శారద, డీఆర్డీవో శ్రీలత, మార్కెటింగ్ డీడీ పద్మావతి, డీఎంహెచ్‌వో లలితాకుమారి, డీడబ్ల్యూవో సబితకుమారి, సీడీపీవో ఉమారాణి, ఏసీపీ విజయసాయి పాల్గొన్నారు.
మహిళాభివృద్ధికి కేసీఆర్ పెద్దపీట
ప్రభుత్వం అనేక పథకాలతోపాటు స్వయం సమృద్ధి సాధించేందుకు మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నది. ముఖ్యంగా రాజకీయాల్లో క్రియాశీలం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. మహిళలు తలుచుకుంటే ఏ రంగాన్నైనా అభివృద్ధి దిశగా తీసుకెళ్లవచ్చని నిరూపిస్తున్నారు. ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన దళితబంధు ద్వారా హుజూరాబాద్ సెగ్మెంట్లో పది వేల మంది మహిళలు స్థాపించిన యూనిట్లు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి.
– ఆర్వీ కర్ణన్, కరీంనగర్, కలెక్టర్