మానకొండూర్, నవంబర్ 3: తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చాలా స్పష్టంగా ఉన్నారని, తెలంగాణ మరింత బాగుపడాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని వారు కోరుకుంటున్నారని రాష్ట్రప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం మానకొండూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర భారత దేశంలో 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. సమైక్య పాలనలో తెలంగాణలో కేవలం ఒకేఒక్క ప్రాజెక్టు ఎస్సారెస్పీ మాత్రమే కట్టారని, తెలంగాణలో వందల కిలోమీటర్ల మేర గోదావరి పారుతున్నా నాటి పాలకులు ప్రాజెక్టులు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో గోదావరిపై అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. దీంతో తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు. ఇప్పుడు చెరువులు, కుంటలు ఎండకాలంలో సైతం మత్తళ్లు దుంకుతున్నాయంటే ప్రాజెక్టుల ఫలితమేనని పేర్కొన్నారు. ఫేక్ సర్వేలతో విపక్ష పార్టీలు తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ప్రజలు అనుకుంటున్నారని, తెలంగాణ ఆగం కావద్దంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టాలని అన్ని వర్గాల వారు విశ్వసిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మే స్థితిలేరన్నారు. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ రాష్ట్రం అంధకారం కావడం ఖాయమని, కరెంట్ కష్టాలు తప్పవని తేల్చిచెప్పారు. రైతులు టార్చ్లైట్లు పట్టుకుని పొలాలకు వెళ్లే పరిస్థితి వస్తుందన్నారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు ఊహాల్లో తేలుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం ఖాయమని తేల్చిచెప్పారు.
ఉమ్మడి జిల్లాలో 13 స్థానాలను బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటారని ధీమావ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, నాయకులు గడ్డం నాగరాజు, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, రామంచ గోపాల్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.