ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళల్లో చైతన్యం మూర్తీభవిస్తున్నది. ప్రతి రంగంలోనూ పురుషులకు దీటుగా మహిళా లోకం పోటీ పడుతున్నది. అటు రాజకీయ, ఇటు పరిపాలనా రంగం ఏదైనా సరే.. మేమేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నది. ఇల్లును చక్కదిద్దుతూనే.. సమస్త ఇంటిల్లిపాదికి అండగా నిలుస్తున్నది. సమాజంలో ఎదురవుతున్న సవాళ్లు, కష్టాలు, కన్నీళ్లు అన్నింటినీ అధిగమించడంలో తనకు తానే మేటిగా నిలుస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. తన సత్తా, సామర్థ్యాన్ని చాటుతున్నది. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో రాణిస్తూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖ్యాతిని నలుమూలలా ఎగురవేస్తున్న తీరుపై ప్రత్యేక కథనం.
– కరీంనగర్, మార్చి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంథని, మార్చి 7: మంథనికి చెందిన నారదబట్ల అరుణ తన భర్త నారాయణ శర్మ, కూతురితో కలిసి హైదరాబాద్‌లో స్థిర పడ్డారు. గృహణిగా ఉన్న అరుణ సమాజంలో ఎదురవుతున్న సంఘటనలు, ప్రకృతి పట్ల ఉన్న ఇష్టం, పర్యావరణంపై ఉన్న ఆలోచనలతో 10 సంవత్సరాలుగా సాహిత్యం, కవిత్వాలు, పద్యాల్లో రాణిస్తున్నారు. 2016లో ‘ఇన్నాళ్ల మౌనం తరువాత’ అనే కవిత సంపుటి, 2022లో ‘లోపలి ముసురు’ అనే కవితా సంపుటి రాశారు. ప్రస్తుతం ఆమె ‘అమర్నాథ్ యాత్ర’ చరిత్రను రాయగా సంపుటి ప్రచురణలో ఉన్నది. మంత్రపురి అలియాస్ మంథని విశిష్ఠత గురించి సైతం పలు కథనాలు రాశారు. ‘ఆనంత చందస్సౌరభం’ అనే 10,000 పద్యాల గ్రంథంలో 100 మంది కవులలో నారదబట్ల అరుణ ఒకరు.
అదే విధంగా వివిధ పత్రికల్లో, సండే మ్యాగ్జిన్లతోపాటు పలు కవుల కవిత్వ సంకలనాల్లో నారదబట్ల అరుణ రాసిన సాహిత్యం, కవిత్వాలు, పద్యాలు ప్రచురితమయ్యాయి. 2015లో ఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలోనిర్వహించిన యూత్ ఫెస్టివెల్లో జరిగిన కవి సమ్మేళనంలో సైతం నారదబట్ల అరుణ పాల్గొనడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కవి సమ్మేళనాల్లో, జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే కవి సమ్మేళనాల్లో ఆమె పాల్గొన్నారు. ఆల్ ఇండియా రేడియో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో సైతం పాల్గొన్నారు. అదే విధంగా ఆల్ఇండియా రేడియో కవిత్వం పఠనం సైతం చేశారు. అదే విధంగా 2022లో విశాఖ పట్నంలో జరిగిన పద్య రచనలో నిర్వహించిన ఆవిష్కరణ కార్యక్రమంలో సైతం ఆమె పాల్గొన్నారు.
పేరు: అరుణ నారదభట్ల
తండ్రి పేరు: నారదభట్ల రాజేశ్వర్‌రావు
తల్లి పేరు : నారదభట్ల విజయలక్ష్మి
భర్త పేరు: మల్లావజ్జల నారాయణశర్మ
కూతురు పేరు: మల్లావజ్జల భాషిత
ప్రస్తుత నివాసం: హైదరాబాద్
పుట్టిన తేదీ : 22-11-1974
పుట్టిన స్థలం: మంథని
విద్యార్హత: ఎంకామ్, బీఈడీ
విద్యాభ్యాసం: 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పెద్దపల్లిలోని సరస్వతీ విద్యామందిర్, 6వ తరగతి నుంచి 10వ తరగతి గర్ల్స్ హైస్కూల్ పెద్దపల్లి, ప్రభుత్వ జూనియర్ కళాశాల పెద్దపల్లి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పెద్దపల్లి, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఎంకామ్, కరీంనగర్‌లోని గౌరెశెట్టి బీఈడీ కళాశాలలో సోషల్ సబ్జెక్టులో బీఈడీ పూర్తి
రచనలు : 2016లో ‘ఇన్నాళ్ల మౌనం’ తరువాత అనే కవిత సంపుటి, 2022లో ‘లోపలి ముసురు’ అనే కవిత సంపుటిలు. ప్రస్తుతం ఆమె ‘అమర్నాథ్ యాత్ర’ చరిత్రను రాయగా సంపుటి ప్రచురణలో ఉంది.
నా కృషిని గుర్తించినందుకు సంతోషంగా ఉంది
నేను ఎంకామ్ బీఈడీ పూర్తి చేసి నా భర్త నారాయణ శర్మ, కూతురితో కలిసి హైదరాబాద్‌లో స్థిర పడ్డా. నా భర్త నారాయణశర్మ సైతం సాహిత్యవేత్త కావడం, మా ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండటం, సమాజంలో ఎదురవుతున్న సంఘటనలు, ప్రకృతి పట్ల నాకున్న ఇష్టం, పర్యావరణంపై ఉన్న ఆలోచనలు, సంగీతం, సాహిత్యంపై ఉన్న అభిరుచి నన్ను కవిత్వం వైపు నడిపించాయి. గత 10 సంవత్సరాలుగా సాహిత్యం, కవిత్వాలు, పద్యాలు రాస్తున్నా. అనేక కవి సమ్మేళనాల్లో పాల్గొన్నా. సాహిత్యంలో నేను చేస్తున్న కృషిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పురస్కారానికి ఎంపిక చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా సేవలను గుర్తించి నన్ను అవార్డుకు ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– నారదభట్ల అరుణ, మహిళా పురస్కార అవార్డు గ్రహీత, మంథని
నేతన్న చౌరస్తా, మార్చి 7: “అమ్మాయిని ఒకలా.. అబ్బాయిని ఒకలా చూడడం మంచిది కాదు. కొడుకైనా.. కూతురైనా ఒక్కటే అనే భావన ఉండాలి. మహిళలను ప్రోత్సహించినప్పుడు సమాజంలో అసమానతలు తొలిగిపోతాయి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యం’ అని సూచిస్తున్నారు బాలసాహిత్యంలో రాష్ట్రస్థాయి మహిళా పురస్కారానికి ఎంపికైన డాక్టర్ కందేపి రాణీప్రసాద్. ఇటు కవయిత్రిగా, అటు హాస్పిటల్ మేనేజ్మెంట్, పిల్లల చదువులు అన్నీ చూసుకుంటూ విజయం సాధించిన ఆమె తన ఎదుగుదలను వివరించడంతోపాటు మహిళలకు పలు సూచనలు చేశారు. ఆమె మాటల్లోనే..
మొదట నాన్న.. తర్వాత భర్త ప్రోత్సాహంతో..
నాకు ఒక తమ్ముడు. మా నాన్న ఎప్పుడు కూడా ఆడపిల్ల అని వేరుగా చూడలేదు. ఆస్తి ఇద్దరికి సమానంగా ఇస్తాను అని కూడా చెప్పాడు. స్వాతంత్య్ర ఉద్యమంలో మా నాన్న పోరాటం చేశారు. నాన్న మంచి సాహితీ వేత్త. నాకు తన పోలికలే వచ్చాయి. అనారోగ్యంతో 20 ఏండ్ల క్రితం నాన్న చనిపోగా.. అమ్మ ఇప్పటికీ నాతోనే ఉంటున్నది. నేనే చూసుకుంటా. 1970లో అంగళలకుదిటి సుధరాచారిటీస్ పెట్టి చాలా మంది కవులకు, ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నవారు రాసిని పుస్తకాలను ప్రింటింగ్ చేయించి సహాయపడ్డారు. నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదివేటప్పుడు సాహితీ సభకు నన్ను మా నాన్న సభాధ్యక్షురాలిగా కూర్చోబెట్టారు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. అయినా ధైర్యంతో ముందుకుసాగా.1999లో పూలతోట అనే మొదటి పుస్తకాన్ని రాశా. దీనికి మంచి స్పందన వచ్చింది.
ఈ పుస్తకాన్ని రాసినప్పుడు ఫోన్లు లేవు.. సుమారు 700ల ఉత్తరాల ద్వారా సందేశాలను పంపించారు. నేను చాలా సంతోషించా. అలాగే, ఇప్పటి వరకు నేను 42 పుస్తకాలు రాశా. 100కి పైగా అవార్డులు అందుకున్నా. నా భర్త పిల్లల డాక్టర్. పెళ్లి అయ్యాక భర్త ప్రోత్సాహంతో ఎంఎస్సీ, ఎంఏ, పీహెచ్డీ పూర్తి చేశా. ఏ ఆడపిల్ల అయినా పెళ్లి అయ్యాక భర్తల ప్రోత్సాహం లేకుండా ముందుకు సాగలేరు. పిల్లల్ని స్కూలుకు పంపించడం, మళ్లీ హాస్పిటల్ మేనేజ్మెంట్ చూసుకోవడం ఇవన్నీ నా రోజు వారి పనులు. దొరికిన కొద్దిపాటి సమయంలో కవిత్వాలు, పుస్తకాలు రాయడానికి కేటాయించేదాన్ని. నా ఇద్దరు పిల్లలు వరంగల్‌లో మెడిసిన్ చదివేటప్పుడు సిరిసిల్లలో 15 రోజులు ఉండి మళ్లీ వరంగల్‌లో 15 రోజులు వారితో గడిపేదాన్ని. ఇప్పుడు నా పెద్ద కొడుకు హైదరాబాద్ అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్, చిన్న కొడుకు సైతం హైదరాబాద్ అపోలోలో పిల్లల వైద్యులుగా చేస్తున్నారు. కష్టమైనా అనుకున్నది సాధించాను.
పేరు : డాక్టర్ కందేపి రాణీప్రసాద్
జిల్లా : రాజన్న సిరిసిల్ల
భర్త పేరు : డాక్టర్ కందేపి ప్రసాద్‌రావు(పిల్లల వైద్య నిపుణులు)
పిల్లలు : ఇద్దరు కొడుకులు
వృత్తి : బాలసాహితీవేత్త
చదువు : పీహెచ్డీ
ముద్రిత రచనలు : 27
అనువాదాలు : 9
వ్యాసాలు : 137
అవార్డులు: కళాభారతి, సాహిత్యరత్న, పద్మపీఠం,గ్రామీణ కళాజ్యోతి, విశ్వభారతివారి ఉగాది పురస్కార్, భారత్ ఆర్ట్స్ అకాడమీ.
మహిళలకు సూచన
మహిళలు వంటింటికే పరిమితం కాకుండా బాగా చదువుతున్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అదే విధంగా పిల్లలను పట్టించుకోవాలి. మీరు ఎంత ఎదిగినా పిల్లల చదువులు, బాగోగులు కూడా చూసుకోవాలి. అప్పుడే తన మాతృత్వాన్ని కాపాడుకున్న వాళ్లవుతారు. పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే ప్రపంచానికి నష్టం.