కరీంనగర్ విద్యానగర్, మే 26 : ప్రభుత్వ నర్సింగ్ పాఠశాలల్లో జరిగే తరగతుల నిర్వహణలో సమయపాలన పాటించాలని రాష్ట్ర స్థాయి వైద్య అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్లలో టైం టేబుల్ లేకుండా క్లాసులు నిర్వహించడం, కొన్నిచోట్ల ఉదయం ఆలస్యంగా ప్రారంభించి మధ్యాహ్నానికే ముగించడం, మరికొన్ని చోట్ల సిబ్బంది సమయపాలన పాటించకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్, నర్సింగ్ విద్యా ప్రమాణాలపై ప్రభావం పడుతున్నదనే అంశాన్ని ‘ఒకో నర్సింగ్ సూల్.. ఒకో టైం!’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ ఇటీవల కథనం ప్రచురించింది. ఈ వార్త రాష్ట్ర వైద్య విద్యా శాఖ దృష్టికి చేరడంతో డీఎంఈ ఆఫీస్ వెంటనే స్పందించింది.
ఈ మేరకు ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ నర్సింగ్ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్తి స్థాయి తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు సిద్ధాంత బోధనతోపాటు ప్రాక్టికల్స్, క్లినికల్ శిక్షణ కూడా నిర్దిష్ట సమయాల్లో నిర్వహించాలని సూచించారు. అలాగే, హాజరు నమోదును కచ్చితంగా అమలు చేయాలని, విద్యార్థులు, బోధన సిబ్బంది సమయానికి హాజరు కావాలని చెప్పారు. వైద్య విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందేలా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తామని స్పష్టం చేశారు.