మల్యాల, ఫిబ్రవరి 11 : కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర సర్కారు ఇటీవల వంద కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టనుండగా, నేడు ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్, యాదాద్రి పునర్నిర్మాన ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి వస్తున్నారు. సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. అలాగే ఈ నెల 14న కొండగట్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు. 100 కోట్లతో పలు ప్రత్యేక అభివృద్ధి పనులను చేట్టేందుకు గాను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు రానున్నారు. ఈ విషయాలను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిధుల మంజూరుకు పరిపాలనా పరమైన అనుమతులు రావడంతో కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.
నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. అలాగే సీఎం పర్యటన నేపథ్యంలో జగిత్యాల ఎస్పీ ఎగ్గడి భాస్కర్ స్థానిక పోలీస్ అధికారులతో కలిసి కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో హెలీప్యాడ్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కొండగట్టుకు చేరుకొని ఆలయ పరిసరాలను పరిశీలించారు. తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా అర్చకులు సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. జగిత్యాల డీఎస్పీ రత్నాపురం ప్రకాశ్, మల్యాల సీఐ రమణమూర్తి, మల్యాల, కొడిమ్యాల ఎస్ఐలు మంద చిరంజీవి, వెంకట్రావ్, ఆలయ పాలకమండలి చైర్మెన్ తిరుక్కోవెళూర్ మారుతీస్వామి, స్థానాచార్యుడు కపీందర్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, వకుళాభరణం రఘు, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవస్వామి, ఆలయ పర్యవేక్షకుడు సునీల్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు జెమిని శ్రీనివాస్, బండ లక్ష్మారెడ్డి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.