కలెక్టరేట్, అక్టోబర్ 28: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, పోలీసులు పారదర్శకంగా పనిచేయాలి..వాహనాల తనిఖీలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలి’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ దిశానిర్దేశం చేశారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల జిల్లా ఎన్నికల రిటర్నింగ్, పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, వందశాతం పోలింగ్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.
ఫామ్ -6,7,8, ఎలక్ట్రోరల్, జండర్ రేషియో, పోలింగ్ కేంద్రాలు, చెక్ పోస్టులు, ఇతర ఎన్నికల ఏర్పాట్ల నిర్వహణ, సంసిద్ధతపై జిల్లాల వారీగా సమీక్షించారు. ఆయా జిల్లాల్లో ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఈవోకు జిల్లా ఎన్నికల అధికారులు వివరించారు. అనంతరం సీఈవో మాట్లాడుతూ సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వివరాలను తెప్పించుకొని రాజకీయ పార్టీల సలహాలను స్వీకరించి, క్షేత్రస్థాయిలో సమీక్షించుకోవాలని సూచించారు. సీవిజిల్ యాప్, స్వీప్ కార్యక్రమాలపై గ్రామీణులకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్వోల ద్వారా జారీ చేసే అనుమతుల గురించి తెలుసుకుని, పలు సూచనలు చేశారు.
సువిధ మొబైల్ యాప్, యూజర్ చార్జీలపై క్షుణ్ణంగా వెల్లడించాలని, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల నుండి తీసుకోవాల్సిన అనుమతులకు సంబంధించి రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే చర్యలకు ఉపక్రమించాలన్నారు. రాజకీయ పార్టీల పోస్టర్లు, వాల్‌రైటింగ్‌ను తొలగించాలన్నారు. చెక్ పోస్టుల్లో నిష్పాక్షికంగా తనిఖీలు చేపట్టాలని, పట్టుబడిన నగదు, ఆభరణాలను ఎన్నికల నియావళి మేరకు సీజ్ చేయాలని చెప్పారు. చెక్ పోస్టుల్లో పనిచేసే సిబ్బంది హజరు, పనితీరును సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలన్నారు. బెల్ట్ షాపులు లేకుండా చూడాలని, ఇదివరకు జారీచేసిన లైసెన్సుడు ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు. గతంలో ఓటింగ్ శాతం తకువగా నమోదైన ప్రాంతాలపై దృష్టి పెట్టి పెంపునకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఓటరు జాబితాలో డూప్లికేట్, డబుల్ ఓటర్లు లేకుండా సరిచూసుకోవాలని, ఒకే ఇంటి నంబరుపై ఎకువ మంది ఓటర్లు ఉంటే వాటిని స్వయంగా పరిశీలించాలన్నారు. ప్రజలకు ఓటు ప్రాధాన్యత గురించి వివరిస్తూనే, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ప్రత్యేక సౌకర్యాలపై వివరించాలన్నారు. ప్రతి పాఠశాలలో ఓటు విలువను తెలియజేప్పేలా సదస్సులు నిర్వహించి, పిల్లల తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఓటు వినియోగించుకునేలా పిల్లలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిత్యం జిల్లాల్లో స్వీకరించే ఫిర్యాదులు, వాటిపై తీసుకునే చర్యల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు.
నియోజక వర్గాలలోని గోడౌన్లు, షాదీఖానాలు, అనుమానిత గృహాల్లో తనిఖీలు చేపట్టాలని, బ్యాంకు అధిక లావాదేవీలపై దృష్టి సారించి, వాటి వివరాలను జిల్లా ఎన్నికల అధికారులకు, బ్యాంకర్లు తెలియజేయకపోతే అట్టి వివరాలు సీఈవో ఆఫీసుకు పంపించాలన్నారు. క్యూఆర్ కోడ్, సరైన పత్రాలు లేకుండా బ్యాంకులు తరలించే నగదును సీజ్ చేయడంతో పాటు వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో బీఎల్వోలు నిర్వహించే ఎన్నికల విధులు ఎప్పటికప్పడు పరిశీలించాలని కోరారు. నవంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రతి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు ప్రక్రియను వీడియో రికార్డు చేయించాలని తెలిపారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని, ఎన్నికల సామగ్రి అప్పగింత, తరలింపులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, సీఈవో కార్యాలయానికి ఎప్పటికప్పుడు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీజీ సంజయ్ కుమా ర్ జైన్, డీఐజీ కె. రమేశ్‌నాయుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారులు ప్రఫుల్ దేశాయ్, యాస్మిన్‌బాషా, ముజమ్మిల్ ఖాన్, ఖీమ్యా నాయఖ్, రామగుండం సీపీ రెమా రాజేశ్వరి పాల్గొన్నారు.