కర్ణాటకను మోసం చేసినట్లే తెలంగాణను కూడా మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్‌ను, విద్వేషాలు సృష్టించే బీజేపీని నమ్మవద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ రెండు పార్టీలను నమ్మి మన బిడ్డల భవిష్యత్తును ఆగం చేయవద్దని, రాష్ర్టాన్ని కాపాడే కేసీఆర్‌కు అండగా ఉందామని పిలుపునిచ్చారు. బుధవారం ఆయన కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బొమ్మకల్ అంటే తనకు సెంటిమెంటని, అందుకే ప్రతిసారి ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. 2009 నుంచి తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తున్నారని, కరీంనగర్ చరిత్రలో ఎవరికీ లేని అదృష్టం తనకు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపానని, ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. మీ బిడ్డగా, మీ అన్నగా, తమ్ముడిగా మీ కండ్ల ముందున్న తనను మరోసారి దీవించాలని విజ్ఞప్తి చేశారు.
కరీంనగర్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్ రూరల్: కాంగ్రెస్, బీజేపీని నమ్మవద్దని, మన బిడ్డల భవిష్యత్తును ఆగం చేయవద్దని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్ కోరారు. బుధవారం కరీంనగర్ మండలం బొమ్మకల్ నుంచి మంత్రి గంగుల తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అంతకు ముందు హౌసింగ్ బోర్డులోని యజ్ఞవరహాస్వామి ఆలయంలో కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బొమ్మకల్‌లోని రామాలయంలో కూడా పూజలు నిర్వహించి, అక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా రామాలయం వద్ద గంగుల మాట్లాడారు. కరీంనగర్ గడ్డపై తనకు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కారం తెలిపారు. బొమ్మకల్ అంటే తనకు సెంటిమెంటని, తాను ప్రతిసారి ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నానని, ఇక్కడి నుంచి చేపట్టిన ప్రతీ యాత్ర సఫలీకృతమైందని, మరోసారి ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నానని అన్నారు. ఎప్పుడైనా కాల్వనర్సయ్యయాదవ్ ఇంటి నుంచి ప్రచారం ప్రారంభిస్తానని, ఈ సారి ఆయన లేకపొవడం బాధకరమే అయినా.. ఆయన కుటుంబసభ్యుల అండతో ఈ సారి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాని చెప్పారు. 2009 నుంచి తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తున్నారని, కరీంనగర్ చరిత్రలో ఎవరికీ లేని అదృష్టం తనకు దక్కిందని, ఇంత సుదీర్ఘ కాలం ఇక్కడి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు.
ఈ సుదీర్ఘ కాలంలో కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అగ్రగ్రామిగా నిలిపానన్నారు. తాను ఎమ్మెల్యే కావడానికో, కేసీఆర్ సీఎం కావడానికో ఈ విషయాలు చెప్పడం లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం మీ కండ్ల ముందే కనిపిస్తోందని అన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని, కేసీఆర్ సీఎం కావాలని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కో, బీజేపీకో అధికారం ఇస్తే వాళ్ల అధిష్టానం ఢిల్లీలో ఉంటుందని, వాళ్లకు తెలంగాణ మీద ప్రేమ ఉండదని అన్నారు. తెలంగాణ కరెంట్‌ను, నీళ్లను ఆంధ్రకు ఇవ్వాలని శాసిస్తారని మంత్రి గంగుల స్పష్టం చేశారు.
కేసీఆర్ ఒక్కరే తెలంగాణ ప్రయోజనాలను కాపాడే నాయకుడని, కాంగ్రెస్‌ను నమ్మవద్దని, కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేయలేక ఐదు నెలల్లోనే చేతులెత్తేసిందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని నమ్మేది లేదని కర్ణాటక ప్రజలే అంటున్నారని స్పష్టం చేశారు. కర్ణాటకను మోసం చేసినట్లే తెలంగాణను కూడా మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్‌ను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి ప్రజలు తాగు నీళ్లు తెచ్చుకోవల్సిన దుస్థితి నెలకొన్నదని, అదే తెలంగాణలో అయితే సీఎం కేసీఆర్ ఇంటింటికీ నీళ్లు, 24 గంటల కరెంట్ ఇస్తున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ లేని తెలంగాణను ఊహించుకోవద్దని, కేసీఆర్ ఒక్కరే మన భవిష్యత్తు తరాన్ని కాపాడుతారని, కేసీఆర్‌ను కాదని తెలంగాణను ఢిల్లీ చేతిలో పెడితే మరోసారి ఆగమైతమని వివరించారు. తెలంగాణ రాక ముందటి పరిస్థితి పునరావృతం అవుతుందని జోస్యం చెప్పారు.
పదిహేనేండ్లుగా తనను ఎమ్మెల్యేగా చూశారని, ఎన్నో నిధులు తెచ్చి కరీంనగర్‌ను అభివృద్ధి చేశానని, అనేక మార్పులు తెచ్చానని గంగుల అన్నారు. సుధీర్ఘ కాలం తాను ప్రజల మధ్యనే ఉన్నానని, తనపై పోటీ చేసిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం కనబడకుండా పోయారని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటెస్తే ఎవరి భూములు దక్కకుండా పోతాయని వాపోయారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రజలను మోసం చేసి ఓట్లు వేసుకుని పోయిన తర్వాత ఐదేండ్లు పత్తా లేకుంటా పోతారని తెలిపారు. బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ఇంటి పార్టీ అని, ఈ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, ఈ పదేండ్లలో జరిగిన అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించాలని, కరీంనగర్‌ను మరింత అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. మీ బిడ్డగా, మీ అన్నగా, తమ్ముడిగా మీ కండ్ల ముందు ఉండే వాడిగా భావించి మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు.
కేసీఆర్ మాట ఇస్తే తప్పరని, రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ పార్టే అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. మీ విలువైన ఓటును కాంగ్రెస్, బీజేపీకి వేసి వృధా చేసుకోవద్దని గంగుల కమలాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీలకు అధికారం వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. ఇటీవలనే బొమ్మకల్‌లో 4.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేశామని, ఇప్పటి వరకు గ్రామంలో 13.50 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 773 మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని, కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే ఇపుడు 2,016 ఉన్న పెన్షన్లు 5,016కు పెరుగుతాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలించే రాష్ర్టాల్లో పెన్షన్లు ఇప్పటికీ 600, బీజేపీ పాలించే రాష్ర్టాల్లో 800, వెయ్యి ఇస్తున్నారని అన్నారు.
బొమ్మకల్‌లో 1,220 మందికి రైతుబంధు వస్తోందని, ఇపుడు ఎకరానికి ఏడాదికి 10 వేలు ఇస్తున్నారని, ఈ సారి గెలిస్తే ఎకరానికి, ఏడాదికి 16 వేలు అందిస్తామని మంత్రి గంగుల తెలిపారు. రైతు బీమా కింద గ్రామంలో 18 మందికి, కల్యాణలక్ష్మి కింద 245 మందికి, షాదీముబారక్ కింద 125 మందికి లబ్ధి చేకూరిందని తెలిపారు. మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కల్యాణలక్ష్మి, షాదీముబారక్ 2,00,116 ఇస్తామని హామీ ఇచ్చారు. గృహలక్ష్మి కింద 80 మందికి 3 లక్షల చొప్పున ఇచ్చామని, ప్రతి తెల్ల రేషన్ కార్డుపై సన్న బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. గతంలో బొమ్మకల్ నుంచి కృష్ణానగర్ మీదుగా కరీంనగర్ వెళ్లే రోడ్డు ఏవిధంగా ఉండేది, ఇపుడు ఏ విధంగా ఉందో ఆలోచించాలని స్థానిక ప్రజలను కోరారు. కరీంనగర్లో ప్రతి రోడ్డును అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు.
సీఎం కేసీఆర్ తెచ్చిన దళిత బంధు పథకం దళితులకు బంధువులా మారిందని మంత్రి చెప్పారు. ఈ పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయన్నారు. ఎస్సీకాలనీలో ప్రచారం చేసి మాట్లాడారు. తనను మళ్లీ ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అర్హులందరికీ దళిత బంధు పథకం వర్తింపజేస్తామని చెప్పారు. భూములు దోచుకునే వారికి, దొంగలకు ఓటు వేస్తే, మీ భూములు, మీకు దక్కవని చెప్పారు. మరింత అభివృద్ధి కోసం మరో సారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కరీంనగర్ అసెంబ్లీకి పోటీ చేసిన ప్రతి సారి మంత్రి గంగుల కమలాకర్ బొమ్మకల్ నుంచే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఇది తన సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. ఈ సారి కూడా ఇక్కడి నుంచే బుధవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి అక్కడే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం గ్రామంలో పాద యాత్ర నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. గ్రామానికి వచ్చిన మంత్రికి డప్పు వాయిద్యాలు, ఒగ్గు డోలు కళాకారులు, మహిళల కోలాటాలతో స్థానికులు ఘన స్వాగతం పలికారు. మంత్రి ఓట్లు అభ్యర్థించేందుకు గ్రామంలో పాదయాత్ర చేసినపుడు అడుగడుగునా పూల వర్షం కురిపించారు.
వృద్ధులు, మహిళలను ఓట్లు అభ్యర్థించే సమయంలో వారు మంత్రిని చేరదీసి ఆశీర్వదించారు. హారతులు పట్టి వీర తిలకం దిద్దారు. ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావడంతో రామాలయం నుంచి గ్రామంలోని శివాజీ విగ్రహం వరకు మంత్రి పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, నగర పార్టీ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, పార్టీ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డివేణి మధు, దాది సుధాకర్, మంద రాజమల్లు, ఉప్పు శ్రీధర్, కార్పొరేటర్లు తోట రామన్న, బండారి వేణు, గందె మహేశ్, దేవీ రమణ, భూమాగౌడ్, నాయకులు అంజిరెడ్డి, చింతల శ్రీనివాస్, ఎంపీటీసీలు వెంగళదాసు శ్రీనివాస్, ర్యాకం మోహన్, జక్కినపల్లి శంకర్, కాల్వ మల్లేశం యాదవ్, కాల్వ అశోక్ పాల్గొన్నారు.