కలెక్టరేట్, జనవరి 4: సాగును సస్యశ్యామలం చేయడమే సర్కారు లక్ష్యమని, యాసంగిలో చివరి ఆయకట్టు వరకూ సాగు నీరందించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం మంత్రి అధ్యక్షతన ఇరిగేషన్ శాఖ అధికారులు, గుత్తేదారులతో జిల్లాస్థాయి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే నీటి ఎద్దడి లేని రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి సాధించిందని, జిల్లాలోని 11 మండలాల్లో 1,31,768 ఎకరాలకు కాకతీయ కెనాల్ ద్వారా సాగు నీరందిస్తున్నట్లు చెప్పారు.
వానకాలం, యాసంగిలో డీ-83, 86 కెనాళ్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేసే ముందు ఓవర్ ఫ్లోతో రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు ముందస్తుగా సమీక్షించుకోవాలని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, నీటి అవసరం ఉన్న చోట ఓటీలు ఏర్పాటు చేసి నీటిని తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే గుత్తేదారులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అచ్చంపేట నుంచి నాగులమల్యాల దాకా చేపట్టిన ఫీడర్ చానల్ పనులు, 16 కిలోమీటర్ల మేర చేపట్టిన లిఫ్ట్ కెనాల్ పనులను ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రూ. 288.52 లక్షల అంచనాలతో జిల్లాలో 108 ఓటీల నిర్మాణాలను ప్రారంభించగా, ఇప్పటి వరకు 64 పూర్తయినట్లు చెప్పారు. అదనంగా నిధులు అవసరం ఉన్న చోట ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని, నాగులచెరువు, బద్దిపల్లి చెరువులను ఓటీల ద్వారా నింపాలని సూచించారు.
కెనాల్ నిర్మాణ పనుల్లో ఎదురయ్యే భూ సంబంధిత, ఆర్థిక సమస్యలను పరిష్కరించనున్నట్లు చెప్పారు. మానకొండూర్, చొప్పదండి, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో ఎకడా నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకూడదని, అ సంపూర్తిగా ఉన్న కెనాల్, ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చివరి ఆయకట్టు వరకూ నీటిని అందించేలా ముందస్తు ప్రణాళికను రూపొందించుకోవాలని ఆదేశించారు. చెరువు ప్రాంతాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
యాసంగిలో 22,037 ఎకరాలకు ఎల్ఎండీ ద్వా రా, 1,04,307 ఎకరాలకు ఎస్సారెస్పీ ద్వారా, మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 36,618 ఎకరాలకు నీరందించాలని సూచించారు. జిల్లాలో 23 చెక్ డ్యాంల నిర్మాణాలను చేపట్టగా 90 శాతం కంటే ఎకువ పనులను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మిషన్ కాకతీయ ఫేజ్-1 నుంచి ఫేజ్-4 వరకు 554 పనులు చేపట్టగా, నేటి వరకు 458 పనులు పూర్తయినట్లు చెప్పారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మానకొండూర్, చొప్పదండి, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వొడితల సతీశ్‌కుమార్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్, శిక్షణ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టొప్పో పాల్గొన్నారు.