ఓ వైపు నిరంతర సరఫరా అందించేందుకు శ్రమిస్తూనే.. క్రీడాపోటీలోన్లూ విద్యుత్ ఉద్యోగులు ప్రతిభ చాటుతున్నారు. పోటీ ఏదైనా తమదైన ఆటతీరుతో ప్రత్యర్థిని చిత్తు చేస్తూ తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటున్నారు. కఠోర సాధనతో పలు క్రీడల్లో విజయ బావుటా ఎగురవేస్తున్నారు ఉమ్మడి జిల్లా విద్యుత్ క్రీడాకారులు. ప్రభుత్వం, ట్రాన్స్‌కో ప్రోత్సాహంతో సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. వరుసగా ఏడుసార్లు సీఎండీ ట్రోఫీ గెలుచుకుని రికార్డులు తిరగరాసి జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమవుతున్నారు.
ఏటా ట్రాన్స్‌కో క్రీడా షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. దీనికి అనుగుణంగా స్పోర్ట్స్ కౌన్సిల్స్ జిల్లాల వారీగా జట్లను ఎంపిక చేస్తుంది. జట్టు ఎంపికలోనే అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తుంది. ప్రతి క్రీడాకారుడి ఆటతీరును నిశితంగా సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తుంది. ఉద్యోగులు విధులకు ఆటంకం కలుగకుండా ఉదయం, సాయంత్రం సాధన చేస్తుంటారు. ఇదే కరీంనగర్ జట్టు విజయరహస్యం. గత నెల 13నుంచి 15వరకు మంచిర్యాలలో జరిగిన ఇంటర్ సర్కిల్ బాస్కెట్‌బాల్ పోటీల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించారు.
ఉమ్మడి జిల్లా నుంచి అన్ని స్థాయిల ఉద్యోగులకు పోటీ నిర్వహించారు. ఆటలో మంచి ప్రతిభ చూపిన వారిని జట్టుకు ఎంపిక చేశారు. జట్టులో జీ రాజ్‌కుమార్, ఎం సుధీర్‌కుమార్, కే అనిల్‌కుమార్, ఎన్ విశ్వతేజ, ఆర్ వెంకటనారాయణ, ఎస్ రమేశ్, కే వినీత్ రెడ్డి, ఎండీ మొయిన్పాషా, ఎం వినీల్, ఎన్ శ్రీధర్(కోచ్), సీ తిరుపతి(మేనేజర్) ఉన్నారు. కెప్టెన్‌గా ఈఎల్పీ రాజు బృందాన్ని ముందుండి నడిపిస్తూ జట్టు విజయం సాధించడంలో తోటి క్రీడాకారులను వెన్నుతట్టి ప్రోత్సహించారు. తొమ్మిది జిల్లాలతో హోరాహోరీగా పోరాడారు. చివరగా నల్గొండ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారీ విజయం సాధించారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా కెప్టెన్ ఈఎల్పీ రాజు నిలిచారు. పోటీల్లో ప్రతిభ చూపిన పలువురు క్రీడాకారులకు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది.
ముకరంపుర, నవంబర్ 2 : కరీంనగర్ జిల్లా కేంద్రంలో ముప్పై ఏళ్ల క్రితమే విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో స్పోర్ట్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగులు హైమద్, లక్ష్మయ్య కీలక పాత్ర పోషించారు. క్యాడర్‌తో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించడమే కౌన్సిల్ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం చైర్మన్‌గా ఎస్ఈ వీ గంగాధర్, కార్యదర్శిగా ఈఎల్పీ రాజు వ్యవహరిస్తున్నారు. ఉద్యోగిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా కౌన్సిల్ ముందుకు సాగుతున్నది. ఇప్పటి వరకు వందలాది మంది ఉద్యోగులకు వివిధ క్రీడాంశాల్లో తర్ఫీదునిచ్చి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దింది.
క్రీడాకారులకు సకల సౌకర్యాలు
విద్యుత్ కార్యాలయ సముదాయంలో వివిధ రకాల ఆటల్లో శిక్షణనిచ్చే సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా కోర్టు లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం షటిల్, టేబుల్ టెన్నిస్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, క్రికెట్, హాకి, అథ్లెటిక్స్, క్యారమ్స్, చెస్ విభాగాల్లో కోచింగ్ ఇస్తున్నారు. అందుకోసం సంస్థ క్రీడాకారులకు సకల సౌకర్యాలను సమకూరుస్తున్నది. సాంస్కృతిక అంశాల్లోనూ తమదైన ముద్ర చాటేలా కల్చరల్ వింగ్ సైతం అందరి ఆదరాభిమానాలు సంపాదిస్తూ బహుమతులు కొల్లగొడుతున్నది.
రిటైర్డ్, తోటి ఉద్యోగులే శిక్షకులు
మొదటి నుంచి క్రీడాంశాలపై ఆసక్తి ఉండి విద్యుత్ సంస్థలో ఉద్యోగంలో చేరిన వారు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇదో చక్కటి వేదిక. ఇప్పటివరకు ఎస్ఈ కార్యాలయం ఆవరణలోనే క్రీడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రిటైర్డ్ అయిన వారితోపాటు ప్రస్తుతం వివిధ క్యాడర్లలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులే తోటి వారికి పలు క్రీడల్లో శిక్షణనిస్తున్నారు. సూచనలు, సలహాలిస్తూ మెళకువలు నేర్పుతున్నారు. ఉదయం, సాయంత్రం ఎవరికి నచ్చిన ఆటలో వారికి శిక్షణనిస్తూ మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. దీంతో డిస్కంలు, ఇంటర్ సర్కిల్స్, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఉద్యోగులు సంస్థకు పతకాల పంట పండిస్తున్నారు.
జిల్లాకే ఏడుసార్లు సీఎండీ ట్రోఫీ
స్వరాష్ట్రంలో నిర్వహించిన ప్రతి పోటీలోనూ మంచి ప్రతిభ చూపుతూ చైర్మన్ ట్రోఫీని అందుకున్నారు. స్పోర్ట్స్ కౌన్సిల్ నిర్వహించే పోటీల్లో సాధించిన పాయింట్ల ఆధారంగా సీఎండీ ట్రోఫీని అందిస్తుంటారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వరుసగా ఏడు సార్లు జిల్లా క్రీడాకారుల జట్లే సీఎండీ ట్రోఫీని గెలుచుకుని రికార్డులు బ్రేక్ చేశారు.
క్రీడాపోటీల్లో కరీంనగర్ ప్రత్యేకం
విద్యుత్ సంస్థలో నిర్వహించే క్రీడాపోటీల్లో కరీంనగర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం అన్ని క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణనిచ్చే స్థాయిలోనే ఉన్నాం. ఉద్యోగం చేస్తూనే క్రీడాపోటీల్లో పాల్గొంటూ ఇక్కడి ఉద్యోగులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారానే విజయం సాధ్యమవుతుంది.
– ఈఎల్పీ రాజు, స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి
సమష్టి కృషితోనే విజయం
సంస్థ తరపున నిర్వహించే ప్రతి క్రీడాంశంలో పాల్గొని విజయం సాధించడం సంతోషంగా ఉంది. జట్టు సభ్యులంతా కలిసి కట్టుగా ఆడితేనే సాధ్యమవుతుంది. ఉద్యోగుల మధ్య హోదా, స్థాయి బేధాలు లేకుండా సమన్వయం చేసుకుంటూ సమష్టి సాధనతోనే కరీంనగర్ జట్టు విజయాలు సాధిస్తున్నది.
– రంగు వెంకటనారాయణ, బాస్కెట్‌బాల్ టీం సభ్యుడు