Ramagundam Baldiya | కోల్ సిటీ, ఆగస్టు 16 : రామగుండం నగరపాలక సంస్థ అధికారుల తీరుపై సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజు వినూత్న నిరసన చేపట్టారు. గోదావరిఖనిలో శనివారం కురిసిన భారీ వర్షానికి నగరంలోని అత్యంత విలాసవంత ప్రాంతమైన పాత 26వ డివిజన్ లో ఇళ్ల మధ్యలోకి మోకాళ్ల లోతు వరద నీరు నిలిచిపోయింది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
ఇండ్ల ముందు పార్కింగ్ చేసి ఉన్న వాహనాలు వరద నీటిలో సగం వరకు మునిగిపోయి జలదిగ్బంధంలో చిక్కుకుంది. వర్షం మరింత అధికమైతే ఏకంగా వరద నీరు ఇండ్లలోకి వచ్చే ప్రమాదం ఉండడంతో స్థానికుల సమాచారం మేరకు స్పందించి సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజు వర్షంలో సైతం లెక్క చేయక ఆ డివిజన్ ను సందర్శించి, అక్కడే మోకాళ్ల లోతు వరద నీటిలో నిలుచుని నిరసన చేపట్టారు. వర్షాకాలం రాకముందే ఈ పరిస్థితిని అంచనా వేసి రామగుండం నగరపాలక సంస్థ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయారు. పన్నుల వసూళ్లలో చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం నాటి వర్షానికి మార్కండేయ కాలనీలోని పలు ప్రాంతాలు చెరువులను తలపించాయని, అయినప్పటికీ మున్సిపల్ అధికారులు జాడ లేకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డివిజన్ లోని బీసీ హాస్టల్ మార్గంలో అధికంగా నీరు నిలిచిపోవడం వల్ల చెరువును తలపించే విధంగా ఉందని, వర్షపు నీరు ఇళ్లల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు. ఇదే వీధిలో నూతనంగా నిర్మించిన పెద్ద కాలువకు సైడ్ వాల్ నిర్మించారని, సైడ్ వాల్ కు రంధ్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల సైడ్ వాల్ వద్ద వర్షపు నీరు మోకాళ్ల లోతు నిలిచిపోయాయని అన్నారు. బీసీ హాస్టల్ లైన్ లో రోడ్డు గుంతలుగా మారి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీధి ప్రజలకు మీరు నిలిచి నిలిచిపోవడం వల్ల ఏ గుంత ఎక్కడుందో తెలియక వాహనదారులు పడిపోతున్నారని కనీస రోడ్డు సౌకర్యం కల్పించలేని దుస్థితిలో పాలకులు, అధికారులు ఉన్నారని అన్నారు.
కార్పొరేషన్ పరిధిలో లక్ష్మీనగర్ తర్వాత అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న ప్రాంతం మార్కండేయ కాలనీ అని సౌకర్యాలు మాత్రం అత్యల్పంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ డివిజన్లో కనీసం వీధిలైట్లు కూడా లేవని, ఈ విషయమై మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్య ధోరణి వీడకపోతే ప్రజా ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.