కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhaker ) అధికారులను ఆదేశించారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో బ్రహ్మోత్సవాల(Brahmotsavam) ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 14 నుంచి 21 వరకు జరిగే శ్రీ లక్ష్మీ, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని ప్రతి ఇంటికి బ్రహ్మోత్సవాల వేడుకల ఆహ్వానం పత్రిక అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడ ఎటువంటి సమస్యలకు తావు లేకుండా సజావుగా బ్రహ్మోత్సవాలు జరగాలన్నారు. బ్రహ్మోత్సవాలలో ఆయా శాఖల అధికారులు వారి ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలను ముందుగానే సమీక్షించుకోవాలని వెల్లడించారు.
14వ తేదీ నాటి అధ్యయనోత్సవం నుంచి 21 నాటి శోభాయాత్రలో ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అన్నారు. ఖచ్చితమైన ప్రోటోకాల్ ను పాటించాలని సూచించారు. సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు మార్కెట్ రోడ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు రూ. 5 లక్షలను విరాళంగా అందించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్,అధికారులు తదితరులు పాల్గొన్నారు.