రామడుగు, జూన్ 5 : తాను కాస్తులో ఉన్న తన భూమిని తన పేరున మార్చాలని అధికారులను రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన రైతు కొత్తూరి దుర్గయ్య వేడుకున్నాడు. లేకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళన వ్యక్తం చేశాడు. గురువారం శ్రీరాములపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్ సందర్శించగా, రైతు దుర్గయ్య తన గోడు వెల్లబోసుకున్నాడు.
తాము ఐదుగురం అన్నదమ్ములమని, తమకు పట్టా భూమితో పాటు కొంత అసైన్డ్ భూమి కూడా ఉందని తెలిపాడు. రద్దు బదులు కింద భూములను పంచుకోగా, తమ భూమి ఇతరులకు వెళ్లిందని, వారు ఆ భూమిని అమ్మేసుకున్నారని వాపోయాడు. అయితే, తమకు వారిచ్చిన భూమిలోంచి ఒక టీఎంసీ కాలువ వచ్చిందని, అధికారులు నష్టపరిహారం వారికే అందించారని, ఇంకా 30 గుంటల భూమి మిగిలిందని, ప్రస్తుతం ఆ భూమిలో కాస్తుకు తానే ఉన్నాకూడా, తనకు తెలియకుండా మరోవ్యక్తి పట్టా చేసుకున్నారని వాపోయాడు.
భూభారతిలో దరకాస్తు చేసుకుంటే ఆ భూమి ఎవరిపేర ఉందో వారికే పత్రాలు అందిస్తామంటున్నారని, మోకామీద తానే ఉండగా ఇంకొకరికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గ్రామంలో ఎవరినైనా అడిగి భూమి ఎవరిదనేది తెలుసుకొని పత్రాలు ఇవ్వాలని వేడుకున్నాడు. సర్కారోళ్లు భూభారతి తెచ్చి కుక్కల కొట్లాటవెడ్తన్నరని, ఇది మంచిది కాదని మండిపడ్డాడు.
సమస్యలు మా దృష్టికి తీసుకురావాలి
సున్నితమైన, ప్రత్యేక భూసమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్ కిందిస్థాయి అధికారులకు సూచించారు. రైతు కొత్తూరి దుర్గయ్య స మస్యను తహసీల్దార్ రాజేశ్వరి, అదనపు కలెక్టర్ దృ ష్టికి తీసుకెళ్లడంతో స్పందించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, గ్రామంలో రద్దు బదులు తగాదాలే ఎక్కువగా ఉన్నాయని స్థానిక రైతు, మాజీ సర్పంచు కొస్న లక్ష్మారెడ్డి అధికారుల దృష్టికి తెచ్చారు. అనంతరం కలెక్టర్ తహసీల్దార్‌కు సూచిస్తూ భూభారతి కార్యక్రమాలను గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయాలన్నారు.