Darmaram | ధర్మారం, మే 11: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామ శివారులోని గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్మీదేవి, నరసింహ స్వామికి అర్చకులు వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.
స్వామి వారి దీక్షపరులు ఈ కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు. అనంతరం భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా సోమవారం స్వామివారి జాతర ( రథోత్సవం) మహోత్సవం నిర్వహిస్తామని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దేవుడి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.