కరీంనగర్ తెలంగాణచౌక్/ జగిత్యాల, జూలై 15: గురుపౌర్ణమిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం కరీంనగర్ రీజియన్‌లోని కరీంనగర్, జగిత్యాల, గోదావరిఖని నుంచి తమిళనాడులోని అరుణాచలం దేవస్థానానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు నడిపిస్తున్నామని ఆర్ఎం సుచరిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19న శుక్రవారం రాత్రి గోదావరిఖని బస్టాండ్ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి కరీంనగర్‌కు చేరుకుంటుందని, మరో బస్సు జగిత్యాల నుంచి బయలుదేరుతుందని చెప్పారు. మార్గం మధ్యలో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, వేళూర్ దర్శనం చేసుకొని, 20న శనివారం రాత్రి అరుణాచలం చేరుకుంటుందని తెలిపారు.
అరుణాచల గిరి ప్రదక్షణ, దర్శనం అనంతరం తిరుగుపయనంలో 21న సాయంత్రం అరుణాచలం నుంచి బయలుదేరి 22న ఉదయం జోగులాంబ దేవస్థానానికి వెళ్తుందని చెప్పారు. అక్కడ దర్శనం అనంతరం రాత్రి వరకు ఇటు కరీంనగర్ మీదుగా గోదావరిఖని, మరో బస్సు జగిత్యాలకు చేరుకుంటుందని వివరించారు. ఈ ప్రత్యేక బస్సుకు గోదావరిఖని నుంచి పెద్దలకు 4,850, పిల్లలకు 4,050, కరీంనగర్ నుంచి పెద్దలకు 4500, పిల్లలకు 3800 చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. జగిత్యాల నుంచి ఒకొకరికీ 4600 చార్జి ఉంటుందని డిపో మేనేజర్ జీ సునీత తెలిపారు. టీజీఆర్టీసీ ఆన్లైన్లో ముందస్తు టికెట్లను బుకింగ్ చేసుకోనే అవకాశం ఉందని వివరించారు.