హుజూరాబాద్ టౌన్, జనవరి 2: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో, కేసీ క్యాంప్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ముకోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేకువజామున నాలుగు గంటలకే ప్రత్యేక అభిషేక అర్చనలు జరుగగా, భక్తులు స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధరాచార్యులు, రామాచార్యులు, లిఖిల్చంద్ర ఆచార్యులు, రాహులాచార్యులు, సంతోషాచార్యులు, కిరణాచార్యులు, ఆలయ కమిటీ మెంబర్స్ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 8న ఆలయంలో దీపోత్సవం, 11న కూడారై మహోత్సవం, 13న గోదా రంగనాయకులస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు రామాలయ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు ముందుగా తమ పేరు నమోదు చేసుకోవాలని కోరింది.
జమ్మికుంటలో..
ముక్కోటి ఏకాదశి సందర్భంగా మున్సిపల్ పరిధిలోని శ్రీవేంకటేశ్వరస్వామి, గీతామందిర్, రైల్వే స్టేషన్‌లోని శ్రీరామాలయం, కొత్తపల్లిలోని ఆంజనేయస్వామి, తదితర దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. దైవ దర్శనం కోసం బారులు తీరారు. స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని పఠించారు. మంగహారతులు పట్టారు. మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు దంపతులు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కమిటీల చైర్మన్లు ముక్కా జితేందర్గుప్తా, పురం వైకుంఠం, బొద్దుల రవీందర్, సభ్యులు, భక్తులు, అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.
సింగాపురంలో..
మండలంలోని సింగాపురంలోని శ్రీ పద్మా గోదా సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో ముకోటి ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు, వేదపండితుడు రఘునాథాచార్యులు శ్రీసూక్త, పురుష సూక్త సహిత వేద పఠనం, అర్చనలు చేశారు. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు తరలివచ్చారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ ఆలయాన్ని దర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
సైదాపూర్‌లో..
మండలంలోని ఎక్లాస్పూర్ వేంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు పలు గ్రామాలోని ఆలయాల్లో అర్చకులు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్లాస్పూర్ సర్పంచ్ కొత్త రాజిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
వీణవంకలో..
ముక్కోటి ఏకాదశి సందర్భంగా మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ ఆలయాల ప్రాంగణాలను తీరొక్కపూలు, అరటి తోరణాలతో అందంగా అలంకరించారు. ప్రముఖ వేదపండితులు గూడ జగదీశ్వరశర్మ, సతీశ్ శర్మ వేదమంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఉదయాన్నే ఆలయాలకు చేరుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా ఆలయాల్లో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు.
అపరభద్రాద్రిలో..
అపరభద్రాద్రిగా పేరొందిన మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు దేవాలయ ఈవో కందుల సుధాకర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయగా, దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తర ద్వారా దర్శనం అనంతరం స్వామి వారిని పల్లకీలో మాడవీధుల్లో ఊరేగించారు. ఆలయంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయాగణపతి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు దంపతులు, తహసీల్దార్ మాధవి, జమ్మికుంట తహసీల్దార్ రాజేశ్వరి, ఎస్ఐ తిరుపతి దంపతులతో పాటు ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక్కడ దేవాలయ అర్చకుడు నవీన్‌శర్మ, దేవాలయ సిబ్బంది మోహన్, రవి, రాజయ్యతో భక్తులు ఉన్నారు.