Seasonal diseases | కోరుట్ల, జూలై 3: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులతో ఆయన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వర్షాకాలం దృష్ట్యా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలకు తడి, పొడి, హానికరమైన చెత్తను వేర్వేరుగా అందించేలా అవగాహన కల్పించాలని సూచించారు.
నిషేదిత ప్లాస్టిక్ కవర్ల వినియోగించకుండా ప్రజల్లో చైతన్యం కల్గించే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రహదారులపై నిలిచిన వర్షపు నీరు గుంతలను గుర్తించి భవన నిర్మాణాల నుంచి వచ్చే వ్యర్థాలు, మట్టితో పూడ్చివేత పనులు చేయాలని ఆదేశించారు. అంతకుముందు పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన పారిశుధ్య పనులను ఆయన తనిఖీ చేశారు.
దోమలు వృద్ధి చెందకుండా నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పాగింగ్ చేయాలని, చెత్త కుప్పలపై దోమలు వృద్ధి చెందకుండా రసాయనాలు పిచికారి చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, ఏఈలు అరుణ్ కుమార్, లక్ష్మీ, టీపీఎస్ రమ్య, ఆర్ఐ క్రాంతి, శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.