Siricilla | సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 1 : వెయ్యి రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రేపు(బుధవారం) నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు వితంతువులకు పింఛన్ల పెంపు, 6 గ్యారంటీల అమలు చేయకుండా ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
అదేవిధంగా సిరిసిల్ల నేతన్నల సమస్యలపై ప్రత్యేక పోరాటానికి సిద్ధమవుతున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు త్వరలోనే నేత కార్మికుల పక్షాన నిరసన కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. గ్రామస్థాయి కార్యకర్తలు, నాయకుడు, ప్రజా ప్రతినిధులు ఈ పోరాటంలో పెద్ద సంఖ్యలో పాల్గొనే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నాప్ స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.