Solar panels | పెద్దపల్లి, ఆగస్టు9 : గ్రీన్ ఎనర్జీ ప్రోత్సహించాలనే లక్ష్యంతో జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలపై యుద్ధ ప్రాతిపదికన సోలార్ విద్యుత్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు. సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుపై శనివారం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్ష, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగం, ఉత్పత్తి పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ర్ట క్యాబినెట్ విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాల పై పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల వివరాలు, వాటి పై సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలను వారం రోజులలో పంపాలని కలెక్టర్‌కు సూచించారు.
ఆర్వోఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం గిరిజనులకు పంపిణీ చేసిన 6 లక్షల 17 వేల ఎకరాల్లో సోలార్ పంప్ సెట్లు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. సోలార్ విద్యుత్ ప్యానల్స్ ఏర్పాటుపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. వీసీలో కలెక్టర్‌తో పాటు ఎన్పీడీసీఎల్ పెద్దపల్లి ఎస్ఈ గంగాధర్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.