భూమి గుణం, దాని సారం తెలుసుకొని పంటలు సాగు చేసినప్పుడే రైతన్న పంట పండుతుంది. మంచి దిగుబడి వచ్చి, లాభాల బాట పట్టే అవకాశముంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏటా రెండు సీజన్లలో దాదాపు పది లక్షల ఎకరాల్లో వరి పండిస్తుండగా, ఇతర పంటల సాగు తగ్గిపోయింది. రైతులందరూ ధాన్యం పండిస్తుండడంతో క్రమంగా మార్కెట్లో డిమాండ్ కూడా తగ్గిపోగా, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న మృత్తికల రకాలు, పండే పంటలు, ఆచరించాల్సిన పద్ధతులపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం..
జగిత్యాల, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీరొక్క నేలలు కనిపిస్తాయి.. ఒక్కోచోట ఒక్కో రకం భూములు ఉన్నాయి.. గోదావరి తీర ప్రాంతంలో ఒండ్రు నేలలు అధికంగా ఉంటే.. మైదాన ప్రాంతాల్లో ఎర్ర, నల్లరేగడి భూములు అధికంగా ఉన్నాయి.. మరికొన్ని చోట్ల సౌడు భూములు కనిపిస్తాయి. అయితే ఉమ్మడి జిల్లాలో 70 శాతం ఎర్ర, నల్లరేగడి నేలలు, 20 శాతం సున్నపు నేలలు, మరో 10 శాతం ఇతర రకాలు ఉన్నాయి. మొత్తంగా 93 శాతం భూమిలో నత్రజని లోపం కనిపిస్తున్నది.
80 శాతం పాస్పరస్, 78 శాతం పొటాషియం అధికంగా ఉన్నది. నీటి సౌలత్ అధికంగా ఉండడంతో రైతులు వరి సేద్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ నేలల్లో వరి ఒక్కటే కాదు ఆరుతడి పంటలు పుష్కలంగా పండుతాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వాతావారణ పరిస్థితులు, భూసారం ఆధారంగా పంటలు వేస్తే మేలైన దిగుబడులు వస్తాయని, రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
ఎర్రనేలల లక్షణాలు
ఎర్రనేలలు అంతగా సారవంతమైనవికావు. తేలికగా ఉండి, గాలిపారాడేట్లు ఉంటాయి. పౌష్టిక, సేంద్రియ పదార్థాలు తక్కువగా, భాస్వరం అధికంగా ఉంటుంది. ఐరన్ ఆక్సైడ్‌ను కలిగి ఉండడం వల్ల ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఈ నేలల్లో ప్రధానంగా జొన్న, సజ్జ, పల్లి, ఆముదాల సాగుకు అనుకూలం. అయితే ఉమ్మడి జిల్లాకు గోదావరి నీటిని మళ్లించడం, 24 గంటల విద్యుత్ అందుబాటులోకి రావడం, ఇప్పటికే ఎస్సారెస్పీ, మిడ్‌మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టులు అందుబాటులో ఉండడంతో పుష్కలమైన నీటి వసతి ఏర్పడింది.
దీంతో వరినే అధికంగా పండిస్తున్నారు. మారిన పరిస్థితుల్లో ఎర్రనేలల్లో ఆరుతడి పంటలను పండించాల్సిన అవసరం ఉందని పొలాస శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీటి సౌకర్యం ఉన్న ప్రాంతంలో పల్లి, ఆముదం, పొద్దుతిరుగుడు, కంది, పెసర, మినుము, అలసంద, జొన్న, మక్క, కుసుమ పంటలు, వర్షాధారితమైన ఎర్రనేలల్లో ఉలువలు, జొన్నలు వేయాలని సూచిస్తున్నారు.
నల్లరేగడి నేలలు
అర్థ శుష్క పరిస్థితులు ఉండే దక్కన్ పీఠభూమిలో బస్టాల్ శిలల శైథిల్యంతో నల్లరేగడి నేలలు ఏర్పడ్డాయి. మెత్తని ఇనుప పదార్థాలు ఉండడం వల్ల నల్లగా కనిపిస్తాయి. వీటిని చెర్నోజెమ్, రేగూర్గా పిలుస్తుంటారు. ఈ రకం భూములు నీటిని గ్రహించి ఎక్కువ కాలం నిల్వ చేసుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటిలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, కార్బొనేట్, అల్యూమినియం పుష్కలంగా, నత్రజని, పాస్పారిక్ ఆమ్లం, సేంద్రియ పదార్థం తక్కువ మోతాదులో ఉంటాయి.
పత్తి పంటకు అత్యంత అనుకూలమైనవి. అందుకే వీటిని బ్లాక్ కాటన్ సాయిల్స్గా పేర్కొంటారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో అత్యధికంగా విస్తరించి ఉన్నాయి. పత్తే కాకుండా మిర్చి, పొగాకు, పసుపు లాంటి పంటలు వేయవచ్చు. నీటి సౌకర్యం ఉన్న నల్లరేగడి నేలల్లో ఆముదం, పొద్దు తిరుగుడు, మక్క, పెసర, మినుము, ఉలువలు, జొన్నలు, వర్షాధారిత నల్లరేగడి నేలల్లో శనగ, కుసుమ, ఆవాలు సాగు చేసుకోవచ్చు.
ఒండ్రు నేలలు
సహజసిద్ధంగా ఏర్పడిన సారవంతమైన నేలలను ఒండ్రు నేలలు అంటారు. తెలంగాణలో ఒండ్రునేలల శాతం తక్కువగానే ఉన్నప్పటికీ మూడో స్థానంలో ఒండ్రునేలలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మాత్రం పెద్ద విస్తీర్ణంలో లేవనే చెప్పాలి. నదులు అనేక సంవత్సరాలుగా ప్రవాహంలో తీసుకువచ్చిన ఒండ్రుమట్టిని నిక్షేపం చేయడం వల్ల ఒండ్రు నేలలు ఏర్పడుతాయి. ఇవి నీటిని నిలువ చేసుకునే లక్షణాన్ని కలిగి ఉన్నాయి. అత్యంత సారవంతమైన నేలలుగా ఇవి గుర్తింపు పొందాయి. ఈ నేలల్లో పోటాషియం ఎక్కువగా ఉండి, నైట్రోజన్, పాస్ఫరస్‌లు తక్కువగా ఉంటాయి. వరి, చెరుకు, అరటి సాగుకు అనుకూలం. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో దాదాపు మూడు వేల ఎకరాల చొప్పున, కరీంనగర్ జిల్లాలో 29వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి.
జగిత్యాల జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల సేద్యపు జిల్లాగా ప్రసిద్ధిగాంచింది. అయితే మిగిలిన జిల్లాలతో పోల్చిచూస్తే జగిత్యాలలో భూములు పూర్తిగా సారవంతమైన భూములు కావని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జిల్లాలో దాదాపు 1.30 లక్షల హెక్టార్ల సేద్యభూమి ఉన్నది. ఎర్రబంక మట్టి నేలలే (46.5 శాతం)అధికంగా విస్తరించి ఉన్నాయి. ఎరుపు నిస్సార లోమ్ భూములు 10.9 శాతం, లోతైన నల్లనేలలు 8 శాతం, మధ్యస్థ నల్లనేలలు 7.1 శాతం ఉన్నాయి. సారవంతమైన ఒండ్రు నేలలు కేవలం 0.9 శాతం మాత్రమే. అది కూడా గోదావరినది ప్రవాహం ప్రారంభమయ్యే ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో ఉన్నాయి. జిల్లాలో మొత్తంగా 1,32,627 ఎకరాల్లో ఎర్రబంకమట్టి నేలలు, 31,104 ఎకరాల్లో ఎరుపు లోమ్ నేలలు, లోతైన నల్లరేగడి నేలలు 22,745 ఎకరాలు, మధ్యస్థ నల్లనేలలు 20,260 ఎకరాల్లో ఉన్నాయి. కేవలం 2,621 ఎకరాలు మాత్రమే ఒండ్రు నేలలు.
పెద్దపల్లి జిల్లాలో..
పెద్దపల్లి జిల్లాలోను సేద్యానికి పెద్దగా అనుకూలమైన సారవంతమైన భూములు లేవు. 1.20 లక్షల హెక్టార్లు సేద్యానికి అనుకూలంగా ఉంది. జిల్లాలో లోతైన సున్నపు నల్లనేలలు 39.4 శాతం విస్తరించి ఉన్నాయి. మధ్యస్థ సున్నపు నల్లనేలలు 13.9 శాతం, ఎరుపు నిస్సారమైన లోమ్ నేలలు 6.7, ఎర్రబంక మట్టినేలలు 6.7శాతం, ఎరుపు కంకర మట్టినేలలు 6శాతంలో విస్తరించి ఉన్నాయి. ఇక ఒండ్రునేలలు 9 శాతం విస్తరించి ఉన్నాయి. గోదావరినది పరివాహక ప్రాంతాల్లో ఈ ఒండ్రు మట్టినేలలు విస్తరించి ఉన్నాయి.
కరీంనగర్ జిల్లాలో నేలల రకాలు
కరీంనగర్ జిల్లాలో 1.25 లక్షల హెక్టార్ల సేద్యానికి అనుకూలమైన భూమి ఉన్నది. జిల్లాలో పెద్ద మొత్తంలో లోతైన సున్నపు నల్లనేలలు (44.2 శాతం) విస్తరించి ఉన్నాయి. కరీంనగర్ పరిధిలో ఒండ్రు మట్టినేలలు 13.8 శాతం, ఎరుపు కంకర మట్టి నేలలు 13.1 శాతం, ఎర్ర బంక మట్టి నేలలు 13.1 శాతం ఉన్నాయి. జిల్లాలో 93,841 ఎకరాల్లో సున్నపు నల్లనేలలు ఉన్నాయి. మానేరు తీరం వెంట 29,265 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక ఎరుపు కంకర మట్టి నేలలు 27,771 ఎకరాలు, ఎర్ర బంకమట్టి నేలలు 27,775 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి
సిరిసిల్ల జిల్లాలో..
సిరిసిల్ల జిల్లాలో లక్ష హెక్టార్ల భూమి సేద్యానికి అనుకూలమైంది. జిల్లాలో పెద్ద మొత్తంలో లోతైన సున్నపు నల్లనేలలు విస్తరించి ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 21.13 శాతం ఎర్రబంక నేలలు ఉన్నాయి. ఎరుపు నిస్సార నేలలు 16.38 శాతం, సున్నపు నల్ల నేలలు 10.69 శాతం, ఎర్రబంక మట్టి నేలలు 11.67 శాతం ఉన్నాయి. ఒండ్రునేలలు లేవు. ఎర్రబంక నేలలు 51,483 ఎకరాల్లో, ఎరుపు నిస్సార నేలలు 31,086 ఎకరాల్లో, సున్నపు నల్లరేగడి నేలలు 20,289 ఎకరాల్లో, ఎర్రబంక మట్టినేలలు 22,144 ఎకరాల్లో ఉన్నాయి.