Ramagundam | కోల్ సిటీ, జనవరి 12 : ఇక మీదట సరదాగా బయటకు వెళ్లి దమ్ము కొట్టాలంటే కాస్త ఆలోచించాలి. గోదావరిఖని నగరంలోని పొగరాయుళ్లకు మాత్రం ఇంకా కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే… నాడు కరోనా విపత్తు సమయంలో రూ.10 ల సిగరేట్ ను అమాంతం రూ.20కి పెంచిన వ్యాపారులు ఇప్పుడు వాటిని ఒక్కసారిగా రూ. 25కు పెంచారు. గోదావరిఖనిలో ఆదివారం నుంచి సిగరేట్ ధరలను విఫరీతంగా పెంచారు. వినియోగదారులు ఇదేమని అడిగితే ధరలు పెరిగాయని సమాధానం ఇస్తున్నారు. నగరంలోని వివిధ పాన్ టేలాలకు పొగాకు ఉత్పత్తులను సరఫరా చేసే ఏజెన్సీ వారే ధరలు పెంచారనీ, దీనితో తాము తప్పనిసరిగా రేట్లు పెంచి విక్రయించాల్సి వస్తుందని దాట వేస్తుండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ధరలు పెంచకముందే స్థానిక వ్యాపారులు పాన్ టేలా వర్తకులు రెండు రోజుల ముందే పెద్ద మొత్తంలో సిగరేట్ల ప్యాకెట్లను నిల్వ చేసుకుని ఆదివారం నుంచి కొత్త రేట్ల పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులను విడిగా విక్రయించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న వ్యాపారులు మాత్రం అవేమి పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా ధరలు పెంచి విక్రయిస్తున్న వ్యాపారులు తాజాగా మళ్లీ రేట్లు పెంచి పొగరాయుళ్ల జేబులను ఖాళీ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాన్ టేలాల వ్యాపారులు సిండికేట్ గా మారి కావాలనే పొగాకు ఉత్పత్తుల రేట్లు పెంచి వినియోగదారులను ఆర్థిక దోపిడికి గురి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క సిగరేట్ రూ.25 చొప్పున విక్రయిస్తుండటంతో ఇక మీదట సరదాగా దమ్ము కొట్టలేని పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు.