సింగరేణి బొగ్గు గనుల వేలంపై కార్మిక లోకం కన్నెర్రజేసింది. వామపక్ష పార్టీలు, సింగరేణి కార్మిక సంఘాలతో కలిసి గర్జించింది. కరీంనగర్, పెద్దపల్లి కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాకు దిగింది. ప్రైవేటీకరణ విధానాలను మాను కోవాలని, బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలని సింగరేణికే ఆ గనులను కేటాయించాలని డిమాండ్ చేసింది.
పెద్దపల్లి, జూలై 5(నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలోని కార్మిక క్షేత్రాలైన గోదావరిఖని, యైటిైంక్లెన్‌కాలనీ, సెంటినరీకాలనీల నుంచి కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మహాధర్నా నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాన మంత్రి మోదీకి వ్యతిరేకంగా నినదించారు. ఉదయం నుంచి ఆయా కార్మిక వాడల నుంచి బైక్‌లకు ఎర్రజెండాలు బిగించి బైక్‌లతో ర్యాలీగా తరలివచ్చిన కార్మికులు కలెక్టరేట్ కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బొగ్గుగని బ్లాక్‌ను సింగరేణికే అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. వామపక్ష కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, సీపీఐఎంఎల్ న్యూడెమక్రసీ, ఐఎఫ్‌టీయూల నాయకులు, కార్యకర్తలు మహాధర్మాలో పాల్గొన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్, జూలై 5 : కరీంనగర్లో సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల ప్రతినిధులతో పాటు ఆల్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా శాఖల నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బొగ్గు బ్లాకుల వేలంపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఐక్య ఆందోళనలకు దిగారు. ప్రజాభీష్టానికి భిన్నంగా పాలన ప్రారంభించిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.