కరీంనగర్లో ఇటీవల విలీనమైన గ్రామాల పరిస్థితి అధ్వానంగా మారింది. కార్పొరేషన్లో కలిస్తే సౌకర్యాలు, సదుపాయాలు మెరుగు పడుతాయనుకుంటే కనీసం తమ సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉన్నది. వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేసినా అవి ఎప్పుడు తెరుచుకుంటాయో..? అధికారులు ఎప్పుడు వస్తారో.. తెలియడం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు నిత్యం అవస్థలు పడాల్సి వస్తున్నది.
కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 10 : కరీంనగర్ కార్పొరేషన్లో కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్పూర్, మల్కాపూర్, చింతకుంట గ్రామాలను నాలుగు నెలల క్రితమే విలీనం చేశారు. తర్వాత ఆయా గ్రామాల నుంచి రికార్డులను స్వాధీనం చేసుకొని, పంచాయతీ కార్యాలయాలకు వార్డు కార్యాలయాలంటూ బోర్డులు పెట్టారు. నగరంలో 60 డివిజన్లకు 60 మంది వార్డు ఆఫీసర్లను నియమించడంతోపాటు విలీన గ్రామాల్లోనూ వార్డు ఆఫీసర్లను నియమించారు.
కొత్తపల్లి మున్సిపాలిటీలో రెండు వార్డులుగా విభజించి ఇద్దరు వార్డు ఆఫీసర్లను.. మిగిలిన గ్రామాలకు ఒక్కొక్కరి చొప్పున నియమించారు. వీరికి తోడు ప్రతి ఒక్కరికి అసిస్టెంట్లను కూడా కేటాయించారు. మూడు నెలల కిత్రమే వార్డు ఆఫీసర్లను నియమించగా, మళ్లీ ఇటీవల వార్డు ఆఫీసర్ల డివిజన్లను మార్పులు చేర్పులు చేశారు. దీంతో అసలు తమకు ఏ ఆఫీసర్ ఉన్నాడో.. తెలియని పరిస్థితి విలీన గ్రామాల్లో కనిపిస్తున్నది. మరోవైపు విలీన గ్రామాల్లో పారిశుధ్యం, నీటి సరఫరా, ఇతర సమస్యలపై కనీసం పట్టించుకునే నాథుడు లేడు. స్థానికంగా ఉన్న సమస్యలను వార్డు ఆఫీసర్లు చూసుకుంటారని నగరపాలక ఉన్నతాధికారులు చెబుతుంటే, అసలు తమకేమీ తెలియదన్నట్టు వార్డు ఆఫీసర్లు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది.
గ్రామాలు, మున్సిపాలిటీ విలీనంతో నగరం విస్తరించగా.. అధికారులు మాత్రం విస్తరించిన నగరానికి అనుకూలంగా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విలీన గ్రామాల్లో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేశామని చెబుతున్నా, అక్కడ కనీసం సిబ్బంది కూడా లేకపోవడంతో అవి మూసి ఉంటున్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది. విలీన గ్రామాల ప్రజలు ఏ సమస్యలు విన్నవించాలన్నా నగరంలోని బల్దియా కార్యాలయానికే రావాల్సి వస్తున్నది. తీరా ఇక్కడికి వచ్చాక తమ సమస్యలను ఏ అధికారికి చెప్పాలో తెలియక మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రాలు అందించేందుకు ఎదురుచూడాల్సి వస్తుందని విలీన గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
గ్రామంగా ఉన్నప్పుడు పంచాయతీ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఉండే వారు. నగరంలో కలిసిన తర్వాత ఏ పని చెప్పినా కావడం లేదు. ఇప్పుడు పారిశుధ్య, వీధిదీపాలు, నీటి సరఫరా సమస్యలను ఎవరికి చెప్పినా తమ పరిధిలోకి రాదంటూ తప్పించుకుంటున్నరు. స్థానికంగా ఉండే సిబ్బంది కూడా ఎవరి పర్యవేక్షణలో పని చేస్తున్నరో తెలియడం లేదు. ఏ విషయమైనా నగర కార్యాలయంలోనే చెప్పుకోవాలి అన్నట్టున్నది. ప్రతి పనికి అక్కడికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉన్నది. పంచాయతీ కార్యాలయం ఉన్నా అది ఎందుకూ పని చేయడం లేదు.
– సంపత్‌రావు, మాజీ ఉపసర్పంచ్ (దుర్శేడ్)
నగరపాలక సంస్థలో విలీనమైన తర్వాత గ్రామాన్ని పట్టించుకునే నాథుడు లేడు. వార్డు ఆఫీసర్ ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు పోతారో.. తెలియడం లేదు. కనీసం ప్రజలు కార్యాలయానికి వెళ్లి తమ సమస్యను చెప్పుదామన్నా ఎప్పుడూ మూసే ఉంటుంది. పారిశుధ్యం, నీటి సరఫరా పనులపై పర్యవేక్షణ లేక అధ్వానంగా మారుతున్నది. ఏదైనా సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోతే తమ పరిధి కాదంటున్నారు. దీనికి తోడు రెండు, మూడు నెలలకే అధికారులను మార్చడంతో ఇబ్బందిగా మారుతున్నది.
– తిరుపతినాయక్, మాజీ ఎంపీటీసీ (చింతకుంట)