Vwmulawada | వేములవాడ, మార్చి 20: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో జరిగే సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఈవో రమాదేవి అన్నారు. ఈ నెల 27న జరగనున్న సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆలయ అధికారులతో ఆమె శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజన్న క్షేత్రంలో జరిగే సీతారాముల కళ్యాణానికి సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. భక్తులకు సులభంగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. ఎండలు కూడా మండుతున్నందున వారి అవసరాలకు అనుగుణంగా తాగునీరు సదుపాయాలను ఎక్కడికక్కడ కల్పించాలన్నారు. పార్కింగ్ పై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భక్తులకు అవసరమయ్యే ప్రసాదాలను కూడా తయారు చేయాలన్నారు. పటిష్టమైన భద్రత కల్పించే విధంగా చూడాలన్నారు.
భక్తులు సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకునేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఈవో ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఏఈవోలు శ్రవణ్ కుమార్, అశోక్, జయ కుమారి, డీఈ రఘునందన్, పర్యవేక్షకులు రాధా, వెల్ది సంతోష్, భీమేశ్వర శర్మ, శ్రీనివాస శర్మ, భాస్కర్, రాజేందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.