ట్రెజరీ అధికారులు మామూళ్ల వసూళ్లకు సరికొత్త దారులు వేసుకున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా.. నేరుగా లంచం తీసుకోకుండా తమ సన్నిహితులు, బంధువులకు గూగుల్ పే, ఫోన్‌పే చేయిస్తున్నారు. డబ్బులు ముట్టినట్టు కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే ఆ ఫైల్‌ను కదుపుతున్నారనే ఆరోపణలు వస్తుండగా, ఏసీబీకి చిక్కకుండా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తున్నది. ఇక ఎవరైనా ఉద్యోగి సస్పెండ్ అయితే ట్రెజరీ అధికారులకు పండుగే! తన సర్వీస్ రికార్డుల్లో కొర్రీలు పెట్టకుండా ఉండేందుకు ఒక్కొక్కరి నుంచి 50వేలు వసూలు చేస్తున్నారని ఓ బాధిత ఉద్యోగి వాపోయాడు. ఇవేకాదు, ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లిన ఏ ఫైల్ కూడా మామూళ్లు ముట్టకుండా బయటకు రావడం లేదని తెలుస్తుండగా, ప్రస్తుతం నిఘావర్గాల విచారణలో ఆమ్యామ్యాల వసూళ్లకు సంబంధించి అనేక కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కాగా, రెండు రోజులుగా ట్రెజరీ కార్యాలయాలు, అందులోనూ సిరిసిల్ల, వేములవాడ ట్రెజరీ, సబ్ ట్రెజరీ ఆఫీస్లపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురిస్తున్న కథనాలు సంచలనం రేపుతున్నాయి. వీటిపై సమగ్ర విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పీఆర్టీయూ తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు మ్యాడారం హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి కే హరేందర్‌రెడ్డి బాహాటంగా డిమాండ్ చేసిన తీరు, ఇక్కడి కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతున్నది.
కరీంనగర్, అక్టోబర్ 8 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ ట్రెజరీ, సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో జరుగుతున్న లావాదేవీలపై ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ట్రెజరీ, సబ్ట్రెజరీతోపాటు వేములవాడ సబ్‌ట్రెజరీ కార్యాలయాలపై ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ కూడా కొంత మంది అధికారులు నిబంధనలకు లోబడి పని చేస్తున్నా, అవినీతికి పాల్పడే మరికొంత మంది అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో ఆ శాఖ మొత్తానికి అవినీతి మచ్చ అంటుకుంటున్నది. ఈ నేపథ్యంలో పింఛన్ కోసం రిటైర్డ్ అయిన ఉద్యోగుల ఫైల్ అప్లోడ్ చేసేందుకు ఒక్కొక్కరి వద్ద 5 నుంచి 10 వేల దాకా వసూలు చేయడం, ఇవ్వకపోతే ముప్పు తిప్పలు పెట్టడం, ప్రశ్నించే వారిపై కక్ష కట్టడం.. లాంటి ఆరోపణలతోపాటు మొత్తంగా అవినీతికి కేరాఫ్‌లా మారిన తీరుపై రెండు రోజులుగా ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికే నిఘా వర్గాలు విచారణ జరుపుతున్నాయి. ఆ మేరకు అనేక కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇక్కడ పనిచేసే కొంత మంది ఉద్యోగులు మామూళ్లు వసూలు చేయడంలో ఆరితేరినట్టు విచారణలో వెలుగు చూస్తున్నది. లంచాలు తీసుకునే సమయంలో ఏమాత్రం అనుమానం వచ్చినా చిక్కకుండా ఉండేందుకు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. ఉద్యోగి బంధువు లేదా స్నేహితుడి ఫోన్ నంబర్‌కు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా అమ్యామ్యాలు అందేలా చూస్తున్నారు.
అవి ముట్టినట్టు కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే సంబంధిత ఫైల్ కదుపుతున్నారని విచారణ అధికారులకు బాధితులు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఒకవేళ ఏసీబీ అధికారులు ఆకస్మికంగా రైడ్ చేసిన నగదు దొరకుండా ఉండడంతోపాటు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడకుండా ఉండేందుకు ఈ కొత్త పంథాను అనుసరిస్తున్నారని ఓ రిటైర్డ్ ఉద్యోగి వివరించారు. వసూళ్ల వ్యవహారం కేవలం పింఛన్ ఫైలుకు మాత్రమే పరిమితం కావడం లేదన్న సమాచారం వస్తున్నది. ఒక ఉద్యోగి లేదా ఉపాధ్యాయుడు ఏదేని కారణాల వల్ల విధి నిర్వహణలో సస్పెండ్ అయితే.. ఆ విషయంపై కొర్రీలు వేయకుండా ఉండేందుకు సదరు ఉద్యోగులు ఒక్కొక్కరి నుంచి 50వేలు వసూలు చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇలా లంచం ఇచ్చిన ఓ ఉపాధ్యాయుడు ఇటీవలే పదవీ విమరణ పొందారు. అంతేకాదు, సంఘ నాయకుల ఫైళ్లకు కూడా మామూళ్ల ఇవ్వక తప్పలేదని ఓ ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా పనిచేసి ఇటీవల రిటైర్డ్ అయిన టీచర్ తన ఆవేదనను ‘నమస్తే’తో పంచుకున్నారు. ఒకరిద్దరు కాదు, కొంత మంది అధికారుల మామూళ్ల దాహానికి వందల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు బలయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా నిఘా వర్గాల విచారణకు మాత్రమే పరిమితం కాకుండా, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకొని నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తే పాపాలపుట్ట బయటకు వస్తుందన్న డిమాండ్ బాధిత ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీతోపాటు వేములవాడ ఎస్టీవో కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి బాగోతంపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో నిష్పక్ష పాతంగా విచారణ జరిపాలి. దోషులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు సక్రమంగా పొందాల్సిన బిల్లులపై వసూళ్లకు పాల్పడడం, చేతులు తడపనిదే బిల్లులు అప్లోడ్ చేయకపోవడం అన్యాయం. బాధితులను మానసికంగా ఇబ్బంది పెట్టడం సిగ్గు చేటు. భాధితులైన రిటైర్డ్ ఉపాధ్యాయ, ఉద్యోగులకు అండగా నిలవాల్సిన కొందరు సంఘ నాయకులు, అవినీతికి పాల్పడిన అధికారులకు వత్తాసు పలుకడం అన్యాయం. దీనికి సంబంధమున్న ప్రతి సంఘ నాయకులపై విచారణ చేపట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.
ట్రెజరీ కార్యాలయాల్లో ఒక బిల్ పాస్ కావాలంటే ప్రతి పనికీ ఓ రేటు కడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో మాత్రం అవినీతి పెచ్చుమీరుతున్నదని పలువురు ఉద్యోగులే చెబుతున్నారు. పంచాయతీ కార్యదర్శి నెలనెలా సమర్పించే బిల్లులు నుంచి మొదలు ఇతర అన్ని పనులకు ముక్కుపిండి మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడిగిన మొత్తం ఇవ్వకపోతే అనేక కొర్రీలు పెట్టి, ముప్పు తిప్పులు పెడుతున్నారు. కాగా, ప్రస్తుతం నిఘా వర్గాల విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తున్నది. కొన్ని ట్రెజరీ కార్యాలయాల్లో పై అధికారులు బాగానే ఉన్నా.. కింద నుంచి ఫైల్ కదపాలంటే ముందుగా వారికి ఆమ్యామ్యాలు ముట్టజెప్పాల్సిందేనని, అప్పుడే ఆ ఫైల్ ముందుకెళ్తుందని చెప్పినట్టు తెలుస్తున్నది. అంతేకాదు, వేములవాడలో ట్రెజరీ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగుల తీరుపై అనేక ఆధారాలు నిఘావర్గాలకు చూపించినట్టు తెలుస్తున్నది. లంచాలు వసూలు చేయడంలో వారికి వారే సాటని, ఒక వేళ అడిగింది ఇవ్వకపోతే నెలల తరబడి తిరగాల్సి వస్తుందని, అందుకే ఆర్థిక పరిస్థితులు సహకరించినా సహకరించక పోయినా.. మామూళ్లు ఇవ్వక తప్పలేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. లంచావతారులు సంఘ నాయకులను కూడా వదిలి పెట్టడం లేదని ఓ సంఘానికి చెందిన నాయకుడు తన ఆవేదన వ్యక్తం చేశారు. ముడుపులు ముట్టజెప్పకుండా ఏ పని కావడం లేదని ఓ రెవెన్యూ అధికారి తన బాధను వెల్లగక్కారు.