ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ రాష్ట్రంలోనే మొదట కార్మికక్షేత్రం నుంచే అట్టహాసంగా మొదలైంది. సిరిసిల్ల ఆడబిడ్డ మొదటిచీర అందుకొని మురిసిపోయింది. సిరిసిల్ల మున్సిపల్ 24వ వార్డు పరిధిలోని రాజీవ్‌నగర్‌లో మంగళవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావుతో కలిసి సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తొలిరోజు 30 మందికి పంపిణీ చేయగా, ఆడబిడ్డలు అందుకొని రంగులు, డిజైన్లు చూసి మురిసిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 20: తెలంగాణ ఆడబిడ్డలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బతుకమ్మ చీరెల సంబురం రానే వచ్చింది. రాష్ట్రంలోనే మొదటగా సిరిసిల్లలోనే పంపిణీకి శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల మున్సిపల్ 24వ వార్డు పరిధిలోని సిరిసిల్ల కార్మిక క్షేత్రం రాజీవ్‌నగర్‌లో మంగళవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీఆర్ఎస్ రాష్ట్రనేత చీటి నర్సింగరావుతో కలిసి సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ జ్యోతి ప్రజ్వలన చేసి చీరెల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కాగా తొలిరోజు డివిజన్లో నేత కార్మికులు 30 మందికి చీరెలను అందజేశారు. వాటిని అందుకున్న ఆడబిడ్డలు రంగులు, డిజైన్లను చూసి సంబురపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో మన సంస్కృతీసంప్రదాయాలను కాపాడడంతోపాటు పండుగలకు సర్కారు కానుక అందిస్తున్నదన్నారు. తెలంగాణలో అత్యంత ప్రధానమైన, ఆడబిడ్డల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరెలను అందిస్తున్నదన్నారు.
బృహత్తరమైన ఈ కార్యక్రమంతో సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు ఆడబిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని కలిగించేలా చేస్తున్నారన్నారు. ఆరేళ్లుగా 18ఏళ్లు నిండిన యువతులు, మహిళలకు సర్కారు బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నదన్నారు. ఈ యేడు 240 రకాల వివిధ డిజైన్లు, 30 రకాల రంగులతో 800 రకాల కలర్ కాంబినేషన్‌తో బతుకమ్మ చీరెలను తయారు చేసిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా ఆడబిడ్డలకు చీరెలను అందించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తున్నదన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో వస్త్ర పరిశ్రమలో కార్మికులకు ఉపాధి కల్పనతోపాటు ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక అందించడం కోసం చీరెల తయారీని చేపట్టారన్నారు. మొదటగా సిరిసిల్లలోనే పంపిణీ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని కల్పించాలనే సదుద్దేశంతో బతుకమ్మ చీరెల తయారీ పథకం ప్రవేశపెట్టారన్నారు. ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. టీఆర్ఎస్ రాష్ట్రనేత చీటి నర్సింగరావు మాట్లాడుతూ, రాష్ట్రంలోనే ఈసారి మొదటిసారిగా సిరిసిల్లలోనే బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం చేపట్టడం హర్షనీయమన్నారు. ఆరేళ్లుగా బతుకమ్మ చీరలను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ఏటా రూ.300 కోట్లను వెచ్చించి, బతుకమ్మ చీరెలను తయారు చేయించి అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, స్థానిక కౌన్సిలర్ బుర్ర లక్ష్మి, శంకరయ్యతోపాటు మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.