President Police Medal | తెలంగాణ చౌక్, ఆగస్టు15: రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ను అదనపు ఎస్పీ చంద్రయ్య అందుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ డీ చంద్రయ్యకు భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ కి ఎంపిక చేయగా శుక్రవారం గోల్కొండ ఖిల్లాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెడల్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్న డీ చంద్రయ్యను జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే అభినందించారు.
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌కు ఎంపికైన డీ చంద్రయ్య 1991 సంవత్సరంలో ఎస్సైగా పోలీస్ శాఖలో చేరి శిక్షణ అనంతరం ఎస్సై తొలిసారిగా కొత్తగూడ పోలీస్ స్టేషన్ వరంగల్ లో బాధ్యతలు చేపట్టి, వరంగల్‌లో పలు పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహించారు. అనంతరం 2007 సంవత్సరంలో ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి ఇన్స్పెక్టర్గా వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పని చేశారు.
2017 సంవత్సరంలో డీఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించి రామగుండం కమిషనరేట్ లో క్రైమ్ ఏసీపీగా హన్మకొండ, సైబరాబాద్ లలో ఏసీపీ క్యాడర్ లో ముఖ్య బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కరీంనగర్ పోలీస్ ట్రేనింగ్ కళాశాలలో పని చేశారు. అదే సమయంలో 2021 సంవత్సరంలో అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి జిల్లాలో విధులు నిరహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను సేవ పథకం, ఉత్తమ సేవ పథకాలతో అందించారు. అదేవిధంగా ఈ రోజు మహోన్నత సేవ పథకం కూడా అందుకున్నారు. 34 సంవత్సరాల సుదీర్ఘ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ మెడల్ కి గణతంత్ర వేడుకలను పురస్కరించుకోని ఎంపిక చేసింది.