గోదావరిఖని : కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి (Singareni) సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరానికి మూడు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో ( Coal production) వెనుకబడి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయింది. 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిన సింగరేణి సంస్థ మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 69 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించిన సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరంలో మరో మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గి 69 మిలియన్ టన్నులకే పరిమితమైంది. అంత క్రితం సాధించిన బొగ్గు ఉత్పత్తి కన్నా తక్కువ జరగడంతో 24 – 25 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు నికర లాభాలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింగరేణి ఎంతగానో కృషి చేసినా కూడా మార్చి నెలలో రికార్డు స్థాయిలో 8.91 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 116శాతం చేసిన ప్రయోజనం లేకుండా పోయింది.
నాలుగు డివిజన్లలో మాత్రమే నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు
సింగరేణి సంస్థలో 11 ఏరియాలకు గాను కేవలం నాలుగు డివిజన్లలో మాత్రమే నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధ్యమయ్యాయి . ఇల్లందు ఏరియాలో 41,30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 42,75,274 టన్నులు (104 శాతం) రామగుండం (Ramagundam) డివిజన్ మూడు ఏరియాలో 62,50,000 టన్నుల లక్ష్యానికి 65,11,243 టన్నులు ( 104 శాతం )సాధించింది.
రామగుండం డివిజన్-1లో 49,40,000 టన్నుల లక్ష్యానికి 49,64,514 టన్నులు (100 శాతం ), మణుగూరు డివిజన్లో 1,27,60,000 టన్నుల లక్ష్యానికి 1,27,00000 టన్నులు (100శాతం) సాధించినట్లు సింగరేణి వర్గాలు పేర్కొన్నాయి . మిగతా ఏరియాలలో సింగరేణి నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధ్యం కాలేదు. ఈ కారణంగానే 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి వెనకబడిపోయింది.
కొత్తగూడెం ఏరియాలో1,49,50,000 టన్నుల లక్ష్యానికి 1,44,17,945 టన్నులు (96శాతం), బెల్లంపల్లి డివిజన్లో 38,50,000 టన్నుల లక్ష్యానికి 37,50,000 (97శాతం), మందమర్రి డివిజన్లో 34,60,000 టన్నుల లక్ష్యానికి 27,11,296 టన్నులు (78శాతం) శ్రీరాంపూర్ డివిజన్లో 63,10,000 టన్నుల లక్ష్యానికి 57,86,282 టన్నులు (92శాతం) , రామగుండం డివిజన్-2 లో 98,70,000 టన్నుల లక్ష్యానికి 97,77,936 టన్నులు (99శాతం), అడ్రియాలలో 5,20,000 టన్నుల లక్ష్యానికి 4,09,643 టన్నులు (79శాతం), భూపాలపల్లి లో 49,60,000 టన్నుల లక్ష్యానికి 37,02,292 టన్నులు (75శాతం) సాధించింది. సింగరేణిలో 2025 జనవరి నుంచి మార్చి వరకు కార్మికులకు ఉత్పత్తితో కూడిన ప్రోత్సాహక బహుమతులను ప్రకటించడంతో మూడు నెలల్లో భారీగా బొగ్గు ఉత్పత్తి జరిగింది.
2025-26 లో 76 మిలియన్ టన్నుల టార్గెట్
సింగరేణి సంస్థ 25- 26 ఆర్థిక సంవత్సరంలో 76 మిలియన్ టన్నుల భారీ బొగ్గు ఉత్పత్తి టార్గెట్ ను నిర్దేశించుకుంది. 24-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన 69 మిలియన్ టన్నులకు మించి 7 మిలియన్ టన్నులు అధికంగా బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఒడిస్సాలోని నైని బొగ్గు బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి తో పాటు కొత్తగా మరో రెండు గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి జరిగే అవకాశాలతో ఈ ఆర్థిక సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో 76 మిలియన్ టన్నుల భారీ బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు సింగరేణి సంస్థ ముందుకు సాగుతుంది.