Singareni | గోదావరిఖని : సింగరేణి సంస్థ సీబీఎస్ఈ స్కూల్ ప్రారంభోత్సవ ఆహ్వానంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం, సింగరేణి సిఅండ్ఎండీ, యూనియన్ నాయకులకు అవమానం జరిగిందని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసి అద్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సింగరేణి కార్మికుల పిల్లలకు చదువుల విషయంలో తలెత్తున్న ఇబ్బందులను ఏఐటియుసి గుర్తింపు సంఘంగా గుర్తించి సింగరేణిలో సిబిఎస్ఇ స్కూళ్లు ఏర్పాటు చేయాలని సి అండ్ ఎండీ బలరాంతో చర్చించడం జరిగిందని, ఈ మేరకు మొదటగా గోదావరిఖని, తర్వాత బెల్లంపల్లి రీజియన్ శ్రీరాంపూర్ లో ఒక సిబిఎస్ఇ స్కూల్ ఏర్పాటుకు అంకరీకరించి నేడు 8వ కాలనీలో సిబిఎస్ఇ స్కూల్ ప్రారంభోత్సవం చేసుకుంటుందని తెలిపారు. కానీ సొమ్ము సింగరేణిది, పెత్తనం ప్రభుత్వానిది అన్నట్లుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
సింగరేణి కార్మికుల పిల్లల కోసం సింగరేణి సొమ్ముతో సిబిఎస్ఇ స్కూల్ ఏర్పాటు చేస్తే ప్రారంభోత్సవ ఆహ్వానం లో మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లను తాటికాయంత పెద్దగా వేసి సింగరేణి సి అండ్ ఎండీ, యూనియన్ నాయకుల పేర్లను చిన్నగా కింద వేయడాన్ని ఏఐటీయూసీ పక్షాన సీతారామయ్య తీవ్రంగా ఖండించారు. సింగరేణిలో అధికార పార్టీ ఆగడాలు మితిమీరి పోయాయని, పెద్ద అధికారులు తమ పదవిని కాపాడుకోవడానికి అధికార పార్టీకి తాబేదారులుగా మారారని ఆరోపించారు.
జీఎంలు సిగ్గు లేకుండా ఫైల్స్ సంకలో పెట్టుకొని ఎమ్మెల్యేల వద్దకు పరుగులు తీస్తున్నారని, ఇంతకుముందు సింగరేణి అధికారులతో పనిపడితే ఎమ్మెల్యే లే జీఎంల వద్దకు వచ్చి మాట్లాడేవారని చెప్పుకొచ్చారు. సింగరేణిలో ప్రతి పనికి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే లు తల దూర్చుతూ, అన్నింటి లోనూ తామే అంటున్నారని, అలాంటప్పుడు యూనియన్ లు ఎందుకు, గుర్తింపు సంఘం ఎందుకని ఆయన ప్రశ్నించారు. సింగరేణి అధికారులు తమ పదవులను కాపాడుకోవడానికి, అధికార పార్టీకి సింగరేణిని తాకట్టు పెట్టడం మానుకోవాలనీ, ఇది ఇలాగే కొనసాగితే కార్మికుల నుండి తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం, శ్రీరాంపూర్ బ్రాంచి కార్యదర్శి బాజీసైదా, ఆర్జీ టూ బ్రాంచి కార్యదర్శి జీగురు రవిందర్, నాయకులు రంగు శ్రీను, కారంపూడి వెంకన్న, బలుసు రవి, దాసరి శ్రీనివాస్, ఆకునూరి శంకరయ్య, చెప్యాల మహేందర్ రావు, పడాల కనకరాజు, ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఎ గౌస్ తో పాటు ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.