Post vacant | గోదావరిఖని : సింగరేణి సంస్థలో అత్యంత కీలకమైన డైరెక్టర్ ఫైనాన్స్ పోస్ట్ ఖాళీగానే ఉంటుంది. ఈనెల 16 వరకు సింగరేణి సంస్థ చైర్మన్ గా కొనసాగిన బలరాం చేతిలోనే ఇన్చార్జి బాధ్యతల రూపంలో ఉన్న డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టు ప్రస్తుతం 10 రోజులు గా ఎవరికీ కేటాయించకపోవడంతో సంస్థలో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేలకోట్ల రూపాయల వ్యాపారం చేసే సింగరేణి సంస్థ పెన్సిల్ నుంచి ఏది కొనుగోలు చేయాలన్నా డైరెక్టర్ ఫైనాన్స్ అనుమతి పొందాల్సి ఉంటుంది. అత్యంత కీలకమైన ఈ పోస్టును ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంచుతున్నారు.
మొన్నటి వరకు చైర్మన్ గా పనిచేసిన బలరాం ఈ పోస్టును భర్తీ చేయకుండా తన వద్ద పెట్టుకోవడంతో పని నడుచుకుంటూ పోయింది. కొత్తగా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ కు కేవలం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గానే బాధ్యతలు కల్పించారు. గత చైర్మన్ వద్దనున్న డైరెక్టర్ ఫైనాన్స్ బాధ్యతలను చైర్మన్ కు గాని ఇతర డైరెక్టర్ల కు గాని అదనపు బాధ్యతలు రూపంలో అప్పగించకపోవడంతో ఫైల్స్ పేరుకుపోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి సంస్థలో అత్యంత కీలకమైన డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టును భర్తీ చేయకుండా కాలయాపన చేయడంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సింగరేణి సంస్థలో జరిగే అనేక అవకతవకలకు ఇది ఊతమిచ్చినట్లుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టును ఎందుకు భర్తీ చేయడం లేదంటూ విమర్శలు తీవ్రమవుతున్నాయి. కొత్త డైరెక్టర్ ఫైనాన్స్ ను నియమించే వరకు కనీసం అదనపు బాధ్యతలను ఎవరికైనా అప్పగించాలని డిమాండ్ వినిపిస్తోంది.