Singareni | రామగిరి, జనవరి 5 : సింగరేణి సంస్థ అర్జీ–3 డివిజన్ పరిధిలోని ఓసీపీ–2 విస్తరణ పనులకు అక్రమ నిర్మాణాలు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. రామగిరి మండలం బుధవారంపేట గ్రామంలో పరిహారం పొందాలనే ఉద్దేశంతో ఇటీవల వందల సంఖ్యలో అక్రమ ఇండ్ల నిర్మాణాలు వెలిసినట్లు సమాచారం. అంతేకాకుండా గ్రామ శివారులోని వ్యవసాయ భూముల్లో దాదాపు వందల సంఖ్య లో కొత్త ఓపెన్ వెల్స్ తవ్వడం కలకలం రేపుతోంది.
ఈ పరిణామాలతో అక్కడి నిజమైన భూనిర్వాసితులను గుర్తించడంలో సింగరేణి రెవెన్యూ అధికారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంవత్సరాలుగా భూములు కోల్పోయి జీవనాధారం దెబ్బతిన్న కుటుంబాలకు అందాల్సిన పరిహారం, పునరావాసం అక్రమాలకు బలి కావడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారంపేటలో పరిస్థితి రాజకీయంగా కూడా ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. గ్రామంలో మూడు వర్గాలుగా విడిపోయిన కొందరు వ్యక్తులు అక్రమ కట్టడాలు, కొత్త బావుల తవ్వకాలతో పరిహారం కాజేయాలనే ఉద్దేశంతో మాఫియా తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో నిజమైన నిర్వాసితులు న్యాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అక్రమాలకు తక్షణమే చెక్ పెట్టి, వాస్తవంగా భూములు కోల్పోయిన నిర్వాసితులను గుర్తించి వారికి న్యాయం చేయాలని గ్రామస్తులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అక్రమ మార్కులను అరికట్టకపోతే సింగరేణి ప్రాజెక్టుల పురోగతితో పాటు పేద భూ నిర్వాసితుల భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకట్ట వేసేందుకు సింగరేణి, రెవెన్యూ అధికార్లు చర్యలు చేపట్టి అట్టి ఇంటి నిర్మాణాలకు,బావుల కు విద్యుత్ మీటర్లు ఇవ్వకుండా ఆ శాఖ అధికార్లకు ఆదేశాలు చేసినట్లు తెలిపారు.